తొలగిన అనిశ్చితి.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..!
- ఈ మేరకు బీసీసీఐ, పీసీబీ అంగీకరించాయని 'ఇండియా టుడే' కథనం
- పాకిస్థాన్, దుబాయ్‌లలో మ్యాచ్‌లతో హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించిన ఐసీసీ
- భారత్ ఆడే మ్యాచులతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్‌లకు దుబాయ్ ఆతిథ్యం
- ఒకవేళ నాకౌట్ దశకు ముందే టీమిండియా ఎలిమినేట్ అయితే సెమీ ఫైనల్స్, ఫైనల్ పాకిస్థాన్‌లోనే
2025లో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెర పడింది. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ, పీసీబీ అంగీకరించాయని 'ఇండియా టుడే'లో తన కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా పాకిస్థాన్, దుబాయ్‌లలో మ్యాచ్‌లతో హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించిందని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో పీసీబీ కూడా మొదట హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు ససేమీరా చెప్పింది. కానీ, చివరికి దిగొచ్చి హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించింది.
హైబ్రిడ్ మోడల్ నిర్వహణలో కొన్ని కీలక అంశాలు..
హైబ్రిడ్ మోడల్ నిర్వహణలో కొన్ని కీలక అంశాలు..
- టోర్నీ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని వేదికలపై జరుగుతాయి. అయితే, భారత్ ఆడే మ్యాచులతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్‌లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది.
- భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్‌లకు దుబాయ్ వేదిక కానుంది. ఒకవేళ నాకౌట్ దశకు ముందే టీమిండియా ఎలిమినేట్ అయితే మాత్రం సెమీ ఫైనల్స్, ఫైనల్ పాకిస్థాన్‌లోనే జరుగుతాయి.
- భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయినందుకు పీసీబీకి ఎటువంటి పరిహారం లేదు. బదులుగా పీసీబీ 2027 తర్వాత ఐసీసీ మహిళల టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
- ఇంతకుముందు పాకిస్థాన్‌కు భారత్ రాకపోతే, 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు తాము కూడా తమ జట్టును సరిహద్దు దాటి పంపబోమని ఐసీసీకి పీసీబీ తెలిపింది. అయితే, ఈ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. దాంతో పాక్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడే వెసులుబాటు ఉంటుంది.
- ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగాల్సి ఉంది. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్‌లో ఉన్న రెండు జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి.
- కాగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాకిస్థాన్, భారత్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కు మొదట పీసీబీ లాహోర్‌ను వేదికగా ప్రతిపాదించింది. అది ఇప్పుడు దుబాయ్‌లో జరగనుంది.