పంత్ కోసం రూ.27 కోట్లు అందుకే.. ఎట్టకేలకు ఎల్‌ఎస్‌జీ యజమాని వెల్లడి

  • పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రేజీగా ఉంది.. అందుకే అధిక ధర
  • అయ్యర్ కోసం రూ.26.5 కోట్లు వెచ్చించేందుకు పార్థ్ జిందాల్ సిద్ధమయ్యారు
  • అందుకే పంత్‌కు రెండు మూడు కోట్లు పెంచాలనుకున్నాం
  • ఓ ఇంటర్వ్యూలో సంజీవ్ గోయెంకా వెల్లడి
గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో ఒక ఆటగాడి కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన జట్టుగా ఎల్ఎస్‌జీ నిలిచింది. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లతో కొనుగోలు చేయగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును లక్నో సూపర్ జెయింట్స్ బద్దలుకొట్టింది. పంత్‌ను ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి వెనుక ఉన్న కారణాన్ని ఎల్ఎస్‌జీ సహ-యజమాని సంజీవ్ గోయెంకా వెల్లడించారు.

రిషబ్ పంత్ కోసం రూ.27 కోట్ల వరకు వెళ్లడం వెనుక సైన్స్ ఉందని సంజీవ్ గోయెంకా వెల్లడించారు. రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రేజీగా ఉందని, శ్రేయాస్ అయ్యర్ కోసమే పార్థ్ జిందాల్ రూ.26.5 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమవ్వడంతో పంత్‌ ధరను అంతకంటే ఎక్కువ పెంచాలనేది తన భావన అని ఆయన వివరించారు. రిషబ్ పంత్‌ను దక్కించుకునే విషయంలో పార్థ్ జిందాల్ త్వరపడే అవకాశం ఉంటుందని భావించినట్టు చెప్పారు. అందుకే రెండు మూడు కోట్లు ఎక్కువగా వెళ్లినా ఫర్వాలేదని అనుకున్నామని పేర్కొన్నారు. పంత్‌ను మూడు కోణాల్లో ఆలోచించి జట్టులోకి తీసుకోవాలనుకున్నామని, పంత్ చాలా ముఖ్యమైన ఆటగాడని గోయెంకా చెప్పారు. ‘రణవీర్ అల్లాబాడియా’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పంత్‌ను దక్కించుకోబోతున్నామనే విషయం తమకు తెలుసని, రూ.25-27 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని తమ ప్రణాళికలో ఉందని గోయెంకా వెల్లడించారు. రూ.21-22 కోట్ల వద్ద ఆగిపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్‌టీఎం కార్డు ఉపయోగించడానికి అవకాశం ఉందని భావించడంతో ధర పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. పంత్‌ను పొందేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నించానని గోయెంకా తెలిపారు. 


More Telugu News