తెలంగాణ పల్లెల్లో ఇక ఇంటర్నెట్ విప్లవం.. రూ. 300తో కంప్యూటర్‌గా మారిపోనున్న టీవీ!

  • 8న ఫైబర్‌నెట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • 20 ఎంబీపీఎస్ వేగంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సేవలు
  • తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు 
  • వర్చువల్ నెట్‌వర్క్‌తోపాటు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం
  • గ్రామంలోని అన్ని స్కూళ్లు, కార్యాలయాలకు కనెక్షన్
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇల్లు ఇక ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ సేవలను కేవలం రూ.300కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నెల 8న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైబర్‌నెట్‌ను ప్రారంభించనున్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్‌తో ఇంట్లోని టీవీ కంప్యూటర్‌లా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అందించే కనెక్షన్ ద్వారా 20 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఈ కనెక్షన్ ద్వారా వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. టీవీని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తారు. ప్రతి గ్రామంలోని కూడళ్లు, ఇతర చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్‌నెట్‌ కనెక్షన్ ఇచ్చి వాటిని పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు.

రాష్ట్ర  గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పిస్తుంది. వైఫైలాంటి ఈ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్‌తోపాటు టెలిఫోన్, ఓటీటీల సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేస్తారు. తర్వాత దశల వారీగా మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేస్తారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ నెట్’ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఆ నిధులతోనే ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ను ప్రారంభించబోతోంది.


More Telugu News