అల్లు అర్జున్ రావడం వల్లే ఇలా జరిగింది: మృతురాలి భర్త

  • ఈ నెల 4న సంధ్య థియేట‌ర్‌లో పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షోలో తొక్కిస‌లాట
  • ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన‌ రేవ‌తి అనే మ‌హిళ  
  • ఆమె కుమారుడు శ్రీతేజ్‌కి తీవ్ర గాయాలు.. ఆసుప‌త్రిలో చికిత్స‌
  • తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన‌ మృతురాలి భ‌ర్త 
  • ఆ రోజు బ‌న్నీ రాకపోయి ఉంటే ఇలా జ‌రిగేది కాద‌ని వ్యాఖ్య‌
ఈ నెల 4న రాత్రి 9.30 గంట‌లకు సంధ్య థియేట‌ర్‌లో పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షోలో తొక్కిస‌లాట జ‌రిగిన‌ విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌కు చెందిన‌ రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందింది. గాయ‌ప‌డిన ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్ర‌స్తుతం ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే హీరో అల్లు అర్జున్, సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇదిలాఉంటే.. తాజాగా మృతురాలు రేవ‌తి భ‌ర్త ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఆ రోజు హీరో అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే త‌న‌ భార్య చనిపోయింద‌న్నారు. అలాగే త‌న‌ కొడుకు శ్రీతేజ్‌ ప్ర‌స్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ బ‌న్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాద‌న్నారు. 

త‌న కుమారుడు నెల రోజుల ముందు నుంచి పుష్ప‌-2 సినిమాకు వెళదామ‌ని బలవంతం చేయ‌డంతోనే తాను ఆ రోజు ప్రీమియర్ షోకి తీసుకెళ్లాన‌న్నారు. శ్రీతేజ్‌కి అల్లు అర్జున్ అంటే వీరాభిమానం అన్నారు. ఆయ‌న పాట‌లు, డైలాగులు చెబుతూ ఎల్ల‌ప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండేవాడ‌ని తెలిపారు. 

ఆ రోజు థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం డాడీ అని పేపర్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాడ‌ని, ఇంత‌లోనే ఇలా ఘోరం జ‌రిగిపోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 


More Telugu News