తొక్కిసలాట ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీంపై కేసు నమోదు

  • భద్రతాపరమైన నిర్లక్ష్యం వహించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు
  • హీరో వస్తున్న సమాచారాన్ని ఇవ్వలేదని అల్లు అర్జున్ టీంపై కేసు
  • కేసు వివరాలను వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు... అల్లు అర్జున్ టీంపై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 

పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ ఈ థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రతాపరమైన నిర్లక్ష్యం వహించినందుకు థియేటర్ యాజమాన్యంపై, హీరో వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సకాలంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వహించారంటూ అల్లు అర్జున్ టీంపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105, 118 కింద కేసు నమోదు చేశారు.

కేసు వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించారు. నిన్న రాత్రి 9.40 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ షోకు సినిమాలో నటించిన కీలక నటులు వస్తున్నట్లు అటు అల్లు అర్జున్ టీం, ఇటు థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. థియేటర్‌లోకి వచ్చే వారిని అదుపు చేసేందుకు ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు.

రాత్రి 9.40 గంటలకు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని, ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో వారిని నెట్టివేసిందన్నారు. అప్పటికే థియేటర్ లోపల, బయట కిక్కిరిసిపోయినట్లు చెప్పారు. ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగిందని, ఈ ఘటనలో దిల్‌సుఖ్ నగర్ నుంచి వచ్చిన రేవతి కుటుంబం కిందపడినట్లు చెప్పారు.

ఇది గమనించిన పోలీసులు వారిని పైకి లేపారని తెలిపారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందిందని, 13 ఏళ్ల కొడుకు శ్రీతేజకు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


More Telugu News