సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై బ‌న్నీ టీమ్ ఏం చెప్పిందంటే..!

  • సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న నిజంగా దురదృష్ట‌క‌ర‌మ‌న్న అల్లు అర్జున్ టీమ్
  • బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని హామీ
  • నిన్న సంధ్య థియేట‌ర్‌లో పుష్ప‌- 2 ప్రీమియ‌ర్ షో కోసం వ‌చ్చి రేవ‌తి అనే మ‌హిళ మృతి
పుష్ప‌- 2 ప్రీమియ‌ర్ షో నేప‌థ్యంలో అప‌శ్రుతి చోటు చేసుకుంది. ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి (39) అనే మ‌హిళ ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.  ఆమె కుమారుడు శ్రీతేజ్ అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ విషాద ఘ‌ట‌న‌పై అల్లు అర్జున్ టీమ్ తాజాగా స్పందించింది. ఇది నిజంగా దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చింది. "నిన్న రాత్రి సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న నిజంగా దుర‌దృష్ట‌క‌రం. ప్ర‌స్తుతం బాలుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని క‌లిసి అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అంద‌జేస్తాం" అని తెలిపింది. 

ఇక బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల‌కు ఈ సినిమాను వీక్షించ‌డానికి హీరో అల్లు అర్జున్ సంధ్య థియేట‌ర్‌కు  వ‌చ్చారు. దాంతో ఆయ‌న‌ను చూసేందుకు ఒక్క‌సారిగా అభిమానులు ముందుకు తోసుకుంటూ రావ‌డంతో పోలీసులు వారిని చెద‌రగొట్టేందుకు లాఠీఛార్జి చేశారు. దాంతో తొక్కిస‌లాట చోటు చేసుకోగా రేవ‌తి, ఆమె కుమారుడు శ్రీతేజ్  కింద ప‌డిపోయి జ‌నం కాళ్ల మ‌ధ్య న‌లిగిపోయారు. 

ఇద్ద‌రూ తీవ్ర గాయాల‌తో స్పృహ త‌ప్పారు. వెంట‌నే పోలీసులు వారిని ప‌క్క‌కు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ త‌ర్వాత ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ రేవ‌తి మృతి చెందింది. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాలుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 


More Telugu News