నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

  • తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్ల పూర్తి
  • ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
  • ఉత్సవాల నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు పీఏసీ 3వరకే అనుమతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని గురువారం (నిన్న) రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. మాడ వీధుల్లో విష్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు. 

ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి వాహన సేవలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి ఊరేగింపు చేయనున్నారు. 12వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. 

ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు (4వ తేదీ) నుంచి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకూ ప్రైవేటు వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ సందర్భంగా 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకూ ప్రైవేటు వాహనాలకు ఘాట్ రోడ్‌లో అనుమతి లేదు. అలాగే, 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ వరకూ ప్రైవేటు వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను నిలిపివేసినట్లు ప్రకటించారు.


More Telugu News