తుర్కియే పార్ల‌మెంట్‌లో డిష్యుం .. డిష్యుం.. వీడియో వైర‌ల్‌!

  • తుర్కియే పార్ల‌మెంట్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీల ప‌ర‌స్ప‌ర దాడులు
  • ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డిన వైనం
  • వ‌ర్క‌ర్స్ పార్టీ నేత క్యాన్ అట‌లే విష‌య‌మై నిన్న జరిగిన చ‌ర్చే ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం 
ఎంపీలు బాహాబాహీకి దిగ‌డంతో తుర్కియే పార్ల‌మెంట్ శుక్ర‌వారం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ మ‌హిళా ఎంపీతో పాటు ప్ర‌తిప‌క్ష నేత ఒక‌రు కూడా గాయ‌ప‌డ్డారు.  

అస‌లేం జ‌రిగిందంటే..
2013లో తుర్కియే ప్ర‌ధానిగా ఉన్న ఎరోగ‌న్ పాల‌న‌ను వ‌ర్క‌ర్స్ పార్టీ ఆఫ్ తుర్కియే అధినేత క్యాన్ అట‌లే అనేక‌సార్లు స‌వాలు చేశారు. దీంతో 2013లో ఎరోగ‌న్ పాల‌నకు వ్య‌తిరేకంగా ప‌లుమార్లు నిర‌స‌న‌లు జ‌రిగాయి. దాంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌ల‌కు కార‌ణం క్యాన్ అట‌లే అని పేర్కొంటూ తుర్కియే కోర్టు 2022లో ఆయ‌న‌కు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్ర‌స్తుతం ఆయ‌న జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు. 

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క్యాన్ అట‌లే పార్ల‌మెంట్ డిప్యూటీగా ఎన్నిక‌య్యారు. దాంతో పార్ల‌మెంటుకు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, త‌న ప‌ద‌వీకాలం ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ జైలుశిక్ష అనుభ‌విస్తాన‌ని ఇటీవ‌ల ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో కోర్టు అట‌లేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌రిగింది. 

మాట‌మాట పెర‌గ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్ద‌రు ఎంపీలకు గాయాల‌య్యాయి. కాగా, ఎంపీలు ర‌క్తం వచ్చేలా కొట్టుకున్న‌ట్లు స‌మాచారం.  

ఈ ఘ‌ర్ష‌ణ‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ నేత ఓజ్‌గుర్ ఓజెల్ మాట్లాడుతూ, ఎంపీలు కొట్టుకోవ‌డం సిగ్గుచేటు అని అన్నారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా దాడులు చేసుకోవ‌డం ఏంట‌ని, నేల‌పై ర‌క్తం పారుతోంద‌ని వాపోయారు. క‌నీసం మ‌హిళా ఎంపీల‌ను క‌నిక‌రం లేకుండా కొడుతున్నారంటూ  విమ‌ర్శించారు. ఇక తుర్కియే చ‌ట్ట‌స‌భ‌లో స‌భ్యులు ఇలా భౌతిక దాడి చేసుకోవ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఎంపీలు బాహాబాహీకి దిగి కొట్టుకున్న‌ ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి.


More Telugu News