ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం... కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ మంత్రి అతిశీ ఆగ్రహం

  • వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్టం అడుగంటిందన్న అతిశీ
  • కొన్ని రోజులుగా హర్యానా ప్రభుత్వం యమనా నది నుంచి నీటిని విడుదల చేయడం లేదని ఆగ్రహం
  • ఢిల్లీలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుందన్న మంత్రి
  • బీజేపీ మురికి రాజకీయాలు చేస్తోందని మండిపాటు
ఢిల్లీలోని నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఉత్తర ప్రదేశ్ లేదా హర్యానా నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని ఢిల్లీ మంత్రి అతిశీ కేంద్రాన్ని అభ్యర్థించారు. యమునా నది నుంచి హర్యానా ప్రభుత్వం గత కొన్నిరోజులుగా అవసరమైన నీటిని విడుదల చేయడం లేదని... దీంతో వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్టం అడుగంటిందని ఆమె కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

దీంతో దేశరాజధానిలో పెద్ద ఎత్తున నీటి కొరత ఏర్పడిందన్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలకు చేరుకుందని ఆమె తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నీటి డిమాండ్‌ను తీవ్రతరం చేశాయన్నారు. తాగునీటి డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. అవసరాలకు మించి సరఫరా చేయలేని పరిస్థితి ఉందన్నారు.

ఢిల్లీ ప్రజలు నీటి కొరతతో అల్లాడుతుంటే.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ మురికి రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎండలతో అల్లాడుతోందని... దాంతో భూగర్భ జలాలు తగ్గి నీటి కొరత ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సాయపడాల్సింది పోయి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అతిశీ గురువారం వజీరాబాద్ బ్యారేజీని సందర్శించారు. చెరువులో సాధారణ నీటిమట్టం 674.50 అడుగులకు గాను 670.3 అడుగులు ఉన్నట్లు గుర్తించారు.


More Telugu News