అందుకే నా కూతురు కవితను, కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు: కేసీఆర్

  • రాజకీయంగా ఒత్తిడి తీసుకు రావడానికి అరెస్ట్ చేశారన్న కేసీఆర్
  • అరెస్టులకు భయపడేది లేదని, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా
  • ఫోన్ ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ప్రశ్న
రాజకీయంగా ఒత్తిడి తీసుకు రావడానికే తన కూతురు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావించారని... అప్పుడు బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులు ఢిల్లీ కూడా వెళ్లారన్నారు. తమపై మోదీకి ఈ కోపం ఉందన్నారు. నా కూతురు అనే రాజకీయ కక్షతోనే మోదీ కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మోదీకి కంటిలో నలుసులా మారింది తాను, కేజ్రీవాల్ అన్నారు. అందుకే తమపై కక్ష గట్టారని వ్యాఖ్యానించారు.

తన కూతురు బతుకమ్మ ఆడిందని, ఉద్యమం చేసిందన్నారు. విదేశాల్లో మంచి జీవితాన్ని వదులుకొని వచ్చిందని పేర్కొన్నారు. ఆమె నిర్దోషి అన్నారు. ఇలాంటి అరెస్టులకు తాము భయపడేది లేదని... కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతూ... అసలు ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది? అని ప్రశ్నించారు. ఈ కేసుతో ఏమీ కాదు... భ్రమల్లో ఉండవద్దన్నారు. తమకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుందని... వాళ్లు ఎలా తీసుకువస్తారో మాకేం తెలుసు అన్నారు. రేవంత్ రెడ్డే ఓటుకు నోటులో పట్టుబడ్డారన్నారు.

నా మీద దుర్భాషలాడారు

తనను పార్టీ వాళ్లు, అభిమానులు టైగర్ అని పిలుస్తారని... అందుకే సీఎం రేవంత్ రెడ్డి పులిని చర్లపల్లి జైల్లో వేస్తానని... డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని వెకిలిగా మాట్లాడారని మండిపడ్డారు. నా మీద దురుసుగా మాట్లాడటం ఏమిటన్నారు. దుర్భాషలాడటం సరికాదన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధర రూ.400 దాటుతుందని హెచ్చరించారు.

రూ.15 లక్షలు నాకైతే రాలేదు

తాము అధికారంలోకి వస్తే ఒక్కో ఇంటికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ చెప్పారని... నాకైతే రాలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్ అని నినాదాలు ఇచ్చారని... కానీ ఎవరి వికాసం జరిగింతో తెలియదన్నారు. బీజేపీ పాలనలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్నారు. 2004-2014 మధ్య వృద్ధి రేటు 6.8 శాతం ఉంటే 2014-24 మధ్య 5.8 శాతానికి తగ్గిందన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలకు మించి తమకు సీట్లు వస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై అక్కసుతో మాట్లాడకూడని భాషలో మాట్లాడారని మండిపడ్డారు. దాని ఫలితం ఇప్పుడు కాంగ్రెస్ అనుభవించబోతుందన్నారు. కాంగ్రెస్‌ను ప్రజాగ్రహం ముంచడం ఖాయమన్నారు. జిల్లాలను తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడుతుందని హెచ్చరించారు.


More Telugu News