చెట్లను కౌగిలించుకుని గిన్నిస్ రికార్డు కొట్టాడు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • చ‌రిత్ర సృష్టించిన ఘ‌నాకు చెందిన 29 ఏళ్ల అబూబ‌క‌ర్ తాహిరు 
  • గంట‌ వ్య‌వ‌ధిలో 1,123 చెట్ల‌ను కౌగిలించుకుని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుకెక్కిన ప‌ర్యావ‌ర‌ణ వేత్త 
  • ప్ర‌స్తుతం అమెరికాలో ఫారెస్ట్రీ కోర్సు విద్యార్థిగా ఉన్న తాహిరు 
  • స‌గ‌టున నిమిషానికి 19 చెట్ల‌ను వాటేసుకోవ‌డం గ‌మ‌నార్హం  
ఘ‌నాకు చెందిన 29 ఏళ్ల ప‌ర్యావ‌ర‌ణ వేత్త అబూబ‌క‌ర్ తాహిరు చ‌రిత్ర సృష్టించారు. గంట‌ వ్య‌వ‌ధిలో 1,123 చెట్ల‌ను కౌగిలించుకుని గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. తాహిరు ప్ర‌స్తుతం అమెరికాలో ఫారెస్ట్రీ కోర్సు విద్యార్థిగా ఉన్నారు. ఈ ఫీట్‌ను అలబామాలోని టుస్కేగీ జాతీయ అర‌ణ్యంలో చేశారు. తాహిరు స‌గ‌టున నిమిషానికి 19 చెట్ల‌ను వాటేసుకోవ‌డం గ‌మ‌నార్హం.  

అయితే, ఇది కేవలం అడవుల్లో జరిగే సాధారణ షికారు కాదు. ఈ రికార్డుకు అర్హత సాధించేందుకు తాహిరు నిమిషానికి దాదాపు 19 కౌగిలింతలు సాధించి చురుకైన వేగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ప్రతి ఆలింగనం చెట్టు చుట్టూ రెండు చేతులు చుట్టి, పూర్తిగా కౌగిలించుకోవాలి. అలాగే వాటేసుకునే ప్రయత్నం సమయంలో చెట్లకు హాని కలిగించకూడదు.

కాగా, ఈ వ‌ర‌ల్డ్‌ రికార్డును సాధించ‌డం ప‌ట్ల తాహిరు ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. "ఈ ప్రపంచ రికార్డును సాధించడం చాలా గొప్ప గిఫ్ట్‌గా భావిస్తున్నా. ఇది మన పర్యావరణ వ్యవస్థలో చెట్ల కీలక పాత్రను, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది" అని అన్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్‌, భారీ సంఖ్య‌లో కామెంట్స్ వ‌స్తున్నాయి. తాహిరు సాధించిన విజయానికి నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.


More Telugu News