టీ20 వరల్డ్‌ కప్‌కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై మండిపడ్డ ఇర్ఫాన్ పఠాన్

  • పాండ్యా ఎంపిక విషయంలో మినహాయింపులు ఎందుకని సెలక్టర్లను ప్రశ్నించిన ఇర్ఫాన్ పఠాన్
  • దేశవాళీ క్రికెట్ ఆడని హార్దిక్ ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని నిలదీత 
  • వైఎస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా సరైన ఆటగాడని అభిప్రాయపడ్డ ఇర్ఫాన్ 
టీ20 వరల్డ్ కప్2024కు ఫామ్‌లో లేని హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో అతడి స్థానం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ కారణంతో పాండ్యాను ఎంపిక చేశారంటూ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు మాజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తాజాగా, మాజీ ఆల్‌-రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, హార్ధిక్ పాండ్యా ఎంపిక విషయంలో మినహాయింపులు ఎందుకని బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. పాండ్యాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకోవాలంటూ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను టీమిండియా బలవంతంగా గెంటివేశారని ప్రస్తావించాడు. మరి హార్ధిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ముందు ఈ ఆప్షన్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని, హార్ధిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్‌కు దూరంగానే ఉన్నాడు కదా? అని ప్రశ్నించాడు.

‘‘ గతంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడేమో టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత మరో కొత్త ప్రణాళిక ఉంటుంది. పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌లలో ఒకర్ని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నారు. అయితే హార్ధిక్ పాండ్యా ప్రదర్శనపై ఇక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత క్రికెట్‌లో అతడి నిలకడ, నిబద్ధతలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

టీమిండియా తరపున ఆడే ఆటగాడు ఏడాది పొడవునా దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా ఆడగలగాలని పేర్కొన్నాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యాకు వైస్ కెప్టెన్సీని అప్పగించడాన్ని కూడా తప్పుబట్టాడు. వైస్ కెప్టెన్ విషయంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చక్కటి ఎంపిక అని అభివర్ణించాడు.


More Telugu News