వైసీపీని వదిలేసి నేను జనసేనలోకి రావడానికి కారణం ఇదే: అంబటి రాయుడు

  • తొలుత వైసీపీలో చేరిన అంబటి రాయుడు
  • వైసీపీలో బానిసత్వాన్ని భరించలేక బయటకు వచ్చానన్న రాయుడు
  • తనలాంటి వారు ఆ పార్టీలో ఉండలేరని వ్యాఖ్య
టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు... రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావించారు. ఇందులో భాగంగా ఆయన తొలుత వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, పది రోజుల వ్యవధిలోనే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 

ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అంబటి రాయుడు కలిశారు. అనంతరం జనసేనలో చేరారు. తాజాగా తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చాడో అంబటి రాయుడు తెలిపారు. వైసీపీలో బానిసత్వాన్ని భరించలేకే తాను బయటకు వచ్చానని ఆయన చెప్పారు. తనలాంటి వారు ఆ పార్టీలో ఉండలేరని అన్నారు. రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించాలన్నా, యువతకు బంగారు భవిష్యత్తు కావాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని... మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సువర్ణావకాశం ఇప్పుడు ప్రజల ముందు ఉందని చెప్పారు. 

మచిలీపట్నం ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ల తరపున ప్రచారం చేసేందుకు అంబటి రాయుడు అవనిగడ్డకు వచ్చారు. ఈ సందర్భంగా వంతెన కూడలిలో మాట్లాడుతూ అంబటి రాయుడు పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News