చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు ఆలస్యమవుతోంది?: రఘునందన్ రావు

  • ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు ఎందుకు ముందుకు కదలడం లేదని ప్రశ్న
  • ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రావడానికి పదేళ్లు పడుతుందా? అని ప్రశ్న
  • కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని నిలదీత
  • చంద్రబాబు ఆడియో కావాలంటే ఫోరెన్సిక్ నివేదిక కావాలి... రేవంత్‌పై ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్న
ఓటుకు నోటు కేసులో డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీలో చేరిన వారి కేసులు ముందుకు సాగడం లేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. మంగళవారం ఆయన ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్'లో మాట్లాడుతూ... 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు ఎందుకు ముందుకు కదలడం లేదన్నారు. ఈ కేసులో నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోరెన్సిక్ నివేదిక రావాలని చెబుతున్నారని... కానీ ల్యాబ్ నివేదిక రావడానికి పదేళ్లు పడుతుందా? అని ప్రశ్నించారు. ఒక న్యాయవాదిగా ఇంత సమయం పట్టదని వెల్లడించారు.

ఓటుకు నోటు కేసులో నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడని నాటి మన ముఖ్యమంత్రి కూడా చెప్పారని తెలిపారు. కానీ ఈ కేసు ఇప్పటి వరకు ముందుకు జరగకపోవడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. మరి కేసీఆర్, రేవంత్ కలిసి ములాఖత్ అయి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను... బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. అయినా చంద్రబాబు ఆడియో కావాలంటే ఫోరెన్సిక్ నివేదిక కావాలని... రేవంత్ రెడ్డి డబ్బులు పట్టుకెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడని.. ఈ అంశంపై ఛార్జిషీట్ ఎందుకు వేయలేదన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్నచోట ఈడీ దాడులు జరగవని.. కమలం పార్టీతో సఖ్యతతో లేని పార్టీలపై మాత్రం విచారణ సంస్థలు దాడులు చేస్తాయన్న కేసీఆర్ ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఈడీ, సీబీఐల విధి నిర్వహణలో కేంద్రం జోక్యం లేదన్నారు. అయినా ప్రజలు ఆశీర్వదిస్తేనే రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తాయి తప్ప ఈడీ ఆశీర్వాదంతో కాదని ఎద్దేవా చేశారు. 

తాను బీజేపీలో కంఫర్ట్‌గానే ఉన్నానన్నారు. తనకు 2014 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు టిక్కెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. బండి సంజయ్ పదవీ కాలం పూర్తయ్యాకే అధ్యక్షుడిని మార్చినట్లు చెప్పారు. అందుకే ఆయన కష్టాన్ని గుర్తించి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చిందన్నారు. బండి సంజయ్‌పై నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే అన్నారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డి రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయన నాలుగు లక్షల రూపాయల వేతనం తీసుకోవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదా? అని ఎద్దేవా చేశారు.


More Telugu News