దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే అందుబాటులోకి
ఈ నెల 17 నుంచి అందుబాటులోకి విశాఖ-కొల్లాం రైలు
భువనేశ్వర్-యలహంక రైలు నేటి నుంచే సేవలు
18 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్ మధ్య ఏసీ రైలు
ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలన్న వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి
వేసవి రద్దీని తట్టుకునేందుకు తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఇవి నేటి నుంచి జులై 4 వరకు సేవలు అందిస్తాయి. విశాఖపట్టణం నుంచి కొల్లాం (08539) ప్రత్యేక రైలు 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 8.20 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరుతుంది. కొల్లాం-విశాఖ రైలు (08540) 18 నుంచి జులై 4 వరకు ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
భువనేశ్వర్-యలహంక (02811) నేటి నుంచి మే 25 వరకు సేవలు అందిస్తుంది. ఇది ప్రతి శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.53 గంటలకు దువ్వాడ వచ్చి, 1.55 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. యలహంక-భువనేశ్వర్ రైలు (02812) 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు యలహంకలో బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4.30 దువ్వాడ చేరుకుంటుంది. ఆపై 4.32 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
హౌరా-యశ్వంత్‌పూర్(02863) మధ్య ఈ నెల 18 నుంచి జూన్ 27 వరకు ఏసీ రైలు అందుబాటులో ఉంటుంది. ఇది గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంది. తిరిగి 2.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్- హౌరా (02864) రైలు ఈ నెల 20 నుంచి 29 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆపై 11.07 గంటలకు బయలుదేరుతుంది.
కొచ్చివెల్లి-షాలిమార్(06081) రైలు మే 31 వరకు, షాలిమార్- కొచ్చివెల్లి(06082) రైలు 15 నుంచి జూన్ 6 వరకు, న్యూటిన్ సుఖియా-ఎస్‌ఎంవీ బెంగళూరు(05952) రైలు మే 2 నుంచి జూన్ 27, ఎస్‌ఎంవీ బెంగళూరు- న్యూటిన్ సుఖియా(05951) రైలు మే 6 నుంచి జులై 1 వరకు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని వేసవి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.