రెండు నిమిషాలు కనిపించి.. రెండు బంతులు ఆడి ఉసూరుమనిపించాడు!

  • ఉప్పల్‌లో హైదరాబాద్-చెన్నై మ్యాచ్
  • ధోనీ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
  • అలరిస్తాడనుకుంటే ఉసూరుమనించిన మాజీ స్కిప్పర్
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ మరోమారు అదరగొట్టి సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులతోపాటు సినీనటుడు వెంకటేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అభిమానులకు అయితే లెక్కేలేదు. 

సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. చివరి సీజన్ ఆడుతున్న ధోనీని చూసేందుకు అభిమానులు సీఎస్కే జెర్సీలు ధరించి పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు. అయితే, తన ఆటచూసేందుకు వచ్చిన అభిమానులను ధోనీ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే బ్యాట్‌తో కనిపించిన ధోనీ.. రెండే బంతులు ఆడాడు.

ఇన్నింగ్స్ 20వ ఓవర్లో డరిల్ మిచెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ మెరుపులు మెరిపిస్తాడనుకుంటే ఉసూరుమనిపించాడు. మూడు బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చిన ధోనీ ఆడింది రెండు బంతులు మాత్రమే. నటరాజన్ వేసిన నాలుగో బంతిని ఆడలేకపోయిన ధోనీ ఐదో బంతికి ఫుల్‌షాట్ ఆడినా సింగిల్ మాత్రమే వచ్చింది. చివరి బంతిని జడేజా ఆడాడు. దీంతో ధోనీ అభిమానులు ఉసూరుమన్నారు.


More Telugu News