ఎన్నికల ప్రచారంలో విజయసాయిని ప్రజలు పట్టించుకోవడం లేదు.. అంటూ వీడియో షేర్ చేసిన టీడీపీ!

  • సీతారాంపురంలో విజయసాయి ప్రసంగానికి ముందే జనం ఇంటిబాట
  • వెళ్లొద్దు.. వెళ్లొద్దు అని మైక్‌లో వేడుకున్న వైసీపీ నేత
  • భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని వేడుకోలు
  • అయినా ఫలితం శూన్యమంటూ టీడీపీ ట్వీట్
ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారాంపురంలో ప్రచార రథంపైనుంచి ప్రసంగించేందుకు సిద్ధపడగా జనం ఒక్కసారిగా లేచివెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ఇంటిముఖం పట్టడంతో ప్రచార రథంపై ఉన్న నాయకులు ప్రజలను వెళ్లొద్దని, విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని పదేపదే వేడుకోవడం వీడియోలో కనిపించింది. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన (విజయసాయిరెడ్డి) మాట్లాడతారని ప్రచార రథంపై ఉన్న నేత మైక్‌లో ప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. వెనక్కి తిగి కూడా చూడలేదు ‘చెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు’ అని మైక్‌లో పదేపదే వేడుకోవడం కనిపించింది.

భోజనాలున్నాయి.. బిర్యానీ పెడతాం వెళ్లకండి అంటున్నా ప్రజలు వైసీపీ నేతల ముఖాన ఛీ కొట్టి వెళ్లిపోతున్నారని, ఏ2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదని, ఇక జగన్ సంగతి అయితే సరేసరని టీడీపీ ఎద్దేవా చేసింది. పులివెందులలోనే తుస్సుమందని పేర్కొన్న టీడీపీ.. జగన్ నీ పని అయిపోయింది.. అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది.


More Telugu News