దేశ ప్రజలకు నేనిచ్చే సందేశం ఇదే: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

  • సామాన్యులకు సుప్రీం కోర్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
  • జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు 
  • చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్న సీజేఐ  
  • జిల్లా కోర్టులను బలోపేతం చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థతో బంధం మెరుగవుతుందని వ్యాఖ్య
కుల, మత, ప్రాంత, సంపద, సామాజిక స్థాయి, స్త్రీపురుష భేదాలకు అతీతంగా సుప్రీం కోర్టు దేశప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సాధారణ ప్రజలకు సుప్రీం కోర్టు ఎప్పుడూ అండగా ఉంటుంది. దేశప్రజలకు నేనిచ్చే సందేశం ఇదే’ అని ఆయన అన్నారు. 

‘‘మా దృష్టిలో ఏ కేసూ చిన్నది కాదు. అందరూ మా దృష్టిలో సమానమే. సాధారణ ప్రజలకు అండగా ఉండాలన్నదే మా మిషన్.  అధికారంలో ఎవరున్నా ప్రజలకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ విషయం మాకు తెలుసు. కాబట్టి, చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర’’ అని ఆయన అన్నారు. 

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడంలో న్యాయవ్యవస్థది ముఖ్యమైన పాత్ర అని అన్నారు. సామాన్యులకు ఏదైనా ఇబ్బంది వస్తే తొలుత జిల్లా కోర్టులను ఆశ్రయిస్తారు. అందుకే ఇటీవల తాను జిల్లా జడ్జీలతో సమావేశం నిర్వహించానని అన్నారు. దిగువ స్థాయి కోర్టులను బలోపేతం చేస్తే న్యాయవ్యవస్థతో ప్రజల సంబంధాలు మెరుగవుతాయన్నారు. న్యాయవ్యవస్థలో విధానపరమైన మార్పుల కోసం జిల్లా జడ్జీల సలహాలు, సూచనలు స్వీకరించానని తెలిపారు. త్వరలో ఏకంగా వెయ్యి మంది జడ్జీలతో సమావేశం నిర్వహించబోతున్నట్టు చెప్పారు.


More Telugu News