దేవుడు శాసించాడు, కేసీఆర్ నిర్మించాడు.. యాదాద్రి ఆలయం ఫొటోతో కవిత ట్వీట్

  • యాదగిరి గుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
  • బుధవారం సాయంత్రం గుట్ట పరిసరాల్లో వర్షం
  • ఆలయ ఆవరణలో నిలిచిన వర్షపు నీరు
యాదగిరి గుట్టలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల కోసం టెంపుల్ కమిటీ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించింది. విద్యుత్ వెలుగుల్లో ఆలయం పసిడి కాంతులు వెదజల్లుతోంది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆలయ ఆవరణలో నీరు నిలిచింది. ఈ నీటిలో ఆలయ ప్రతిబింబం కాంతులీనుతూ కనిపిస్తున్న ఫొటోను ఓ పత్రిక ప్రచురించింది. ఈ ఫొటోను బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు.. కేసీఆర్ నిర్మించాడు’ అంటూ క్యాప్షన్ జోడించారు.

బీఆర్ఎస్ హయాంలో యాదగిరి గుట్టను పునర్మించి, యాదాద్రిగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ కవిత చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ అభిమానులు దీనికి పాజిటివ్ గా స్పందిస్తుండగా.. పలువురు గత ప్రభుత్వంపై ఆరోపణలను గుర్తుచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ.. ‘ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిందని బాధ పడాలో లేక ఆ వర్షపు నీటిలో ఆలయ ప్రతిబింబం అద్భుతంగా కనిపిస్తోందని సంతోషపడాలో తెలయట్లేదు’ అంటూ కామెంట్ పెట్టారు.


More Telugu News