గాజాలో అమెరికా మానవతా సాయం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధ్యక్షుడు బైడెన్

  • మానవతా సాయానికి ఆమోదం తెలిపిన అమెరికా ప్రెసిడెంట్
  • యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, ఇతర సామగ్రిని అమెరికా మిలిటరీ జారవిడచనున్నట్టు ప్రకటన
  • ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో 100 మందికిపైగా మృత్యువాతపడ్డ మరోసటి రోజే అమెరికా కీలక ప్రకటన
ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతమొందించడానికి గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. 

త్వరలోనే సహాయక చర్యలు ప్రారంభం కానున్నాయి. అమెరికా మిలిటరీ వాయుమార్గాన ఆహారం సహా ఇతర పదార్థాలను జారవిడచనున్నారు. పాలస్తీనియన్ల వెతలు తగ్గించడమే లక్ష్యంగా యుద్ధంలో దెబ్బతిన్న భూభాగాల్లో అవసరమైన సాయాన్ని అందజేస్తామని అధ్యక్షుడో జో బైడెన్ తెలిపారు. సాయం అందించేందుకు అదనపు మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సముద్రమార్గాన సాయం అందించడంపై కూడా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జోర్డాన్‌లోని మిత్రపక్షాలతో కలిసి అదనపు ఆహారం, సామగ్రిని ఎయిర్‌డ్రాప్‌ చేయనున్నట్టు వివరించారు.

కాగా రెండు రోజులక్రితం సాయం అందించేందుకు వచ్చిన కాన్వాయ్ నుంచి వస్తువులను లాగేందుకు జనాలు ఎగబడడంతో పాలస్తీనియన్ ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో ఈ దారుణం జరిగిందని సాక్షులు చెబుతున్నారు. కనీసం 115 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారని, 750 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.


More Telugu News