500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి.. రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ భావోద్వేగం

  • తల్లి ఆరోగ్యం బాగోలేక అశ్విన్ 48 గంటలపాటు తీరికలేని ప్రయాణం చేయడంపై స్పందించిన భార్య
  • హైదరాబాద్, వైజాగ్ టెస్టులలో 500వ వికెట్ రికార్డు దక్కకపోవడంతో కొని ఉంచిన స్వీట్లు పంచామని వెల్లడి
  • 500వ వికెట్ తీసినప్పుడు మౌనంగా ఉండిపోయామంటూ అశ్విన్ తల్లి ఆరోగ్యాన్ని ప్రస్తావించిన ప్రీతి నారాయణన్
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చారిత్రాత్మకమైన 500వ వికెట్ మైలురాయిని అందుకున్న రవిచంద్రన్ అశ్విన్ అంతగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమే ఇందుకు కారణమైంది. అశ్విన్ మ్యాచ్ మధ్యలోనే హుటాహుటిన బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు. మ్యాచ్ రెండవ రోజున ఇంటికెళ్లి అమ్మను పరామర్శించి తిరుగుపయనమయ్యాడు. మ్యాచ్‌ నాలుగవ రోజున టీమ్‌తో కలిశాడు. కీలకమైన ఒక వికెట్ తీసి 501వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా చారిత్రాత్మకమైన విజయంలో భాగస్వామి అయ్యాడు. దాదాపు 48 గంటలపాటు అశ్విన్ తీరికలేని ప్రయాణంపై అతడి భార్య ప్రీతి నారాయణన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగంగా స్పందించారు.

‘‘500వ వికెట్ కోసం అశ్విన్ హైదరాబాద్‌ టెస్టులో ప్రయత్నించాడు. అది జరగలేదు. వైజాగ్‌ టెస్టులోనూ సాధ్యపడలేదు. కాబట్టి అప్పటికే కొని ఉంచిన స్వీట్లను 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ మేము పంచిపెట్టాము. 500వ వికెట్ దక్కింది కానీ మేము మౌనంగా ఉండిపోయాం. 500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. నిజంగా ఎంత అసాధారణమైన వ్యక్తి. అశ్విన్.. మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను అభిమానిస్తున్నాము!’’ అంటూ ప్రీతి నారాయణన్ వ్యాఖ్యానించారు. అశ్విన్ ఫొటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేశారు.


More Telugu News