భారత్ లో మళ్లీ మొదలవుతున్న మహిళల దేశవాళీ క్రికెట్

  • 2007లో బీసీసీఐలో విలీనమైన భారత మహిళా క్రికెట్ సంఘం
  • 2018 తర్వాత నిలిచిపోయిన దేశవాళీ క్రికెట్
  • దేశంలో పెరుగుతున్న మహిళా క్రికెటర్ల సంఖ్య
  • దేశవాళీ క్రికెట్ పోటీలు నిర్వహించాలని భావిస్తున్న బోర్డు
భారత్ లో గతంలో మహిళల క్రికెట్ కు డబ్ల్యూసీఏఐ పేరిట వేరే సంఘం ఉండేది. ఈ సంస్థ 2007లో బీసీసీఐలో విలీనం అయింది. అప్పటి నుంచి మహిళల క్రికెట్ కార్యకలాపాలను బీసీసీఐనే పర్యవేక్షిస్తోంది. అంతేకాదు, భారత మహిళా క్రికెట్ బీసీసీఐ ఏలుబడిలోకి వచ్చాక మహిళా క్రికెటర్లు ఆర్థికంగా పుంజుకున్నారు. వారికి పారితోషికాలు పెరిగాయి. 2022లో బీసీసీఐ తీసుకున్న చారిత్ర్మాతక నిర్ణయంతో పురుష క్రికెటర్లతో సమానంగా అమ్మాయిల మ్యాచ్ ఫీజులు పెంచారు. 

ఇక అసలు విషయానికొస్తే... ఆరేళ్ల కిందటి వరకు భారత్ లో మహిళలకు దేశవాళీ క్రికెట్ పోటీలు నిర్వహించేవారు. 2014 నుంచి 2018 వరకు అమ్మాయిలకు దేశవాళీ టోర్నీలు జరిపారు. అయితే, కొంతకాలంగా భారత్ లో మహిళల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు నిర్వహించడం లేదు. 

ఈ నేపథ్యంలో, మహిళలకు కూడా దేశవాళీ క్రికెట్ పోటీలు జరపాలన్న డిమాండ్లు తరచుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మహిళలకు కూడా పురుషుల ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తున్నారు.  

హర్మన్ ప్రీత్ సేన ఇటీవల సాధిస్తున్న విజయాలు, డబ్ల్యూపీఎల్ కారణంగా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రతిభావంతులను గుర్తించేందుకు మహిళలకు కూడా దేశవాళీ క్రికెట్ ఉండాలని బీసీసీఐ గుర్తించింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలపై బోర్డు నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


More Telugu News