ఏపీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. షర్మిలకు సహకరిస్తా: రేవంత్ రెడ్డి

  • జగన్.. నేను ప్రత్యర్థులమే కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలాగానే ఏపీ అని వ్యాఖ్య
  • కాబోయే ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు సహకరిస్తానని వెల్లడి
  • విభజన అంశాలపై జగన్‌ను కలిసేందుకు తాను సిద్ధమన్న రేవంత్ రెడ్డి
రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాము ప్రత్యర్థులమేనని.. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ కావాలని జగన్ అనుకుంటే.. కాంగ్రెస్ గెలవాలని తాను కోరుకున్నానని, మోదీని ప్రధానిగా చేయాలని ఆయన కోరుకుంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాబట్టి జగన్‌కు తాము ప్రత్యర్థులమే అన్నారు.

కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాలు తనకు ఎలాగో... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలూ అంతే అన్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల విషయంలో తాను స్పందించడం లేదని.. ఏపీ విషయంలోనూ అంతేనని అన్నారు. ఏపీలోను తమ పార్టీ నాయకులు ఉన్నారని.. వారు స్పందిస్తారన్నారు. విభజన అంశాలపై మాత్రం జగన్‌ను కలిసేందుకు తాను సిద్ధమని చెప్పారు.

షర్మిలకు అండగా ఉంటాను

షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబోతుందని తెలుస్తోందని.. అప్పుడు ఆమెకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు తామిద్దరం కలిసినప్పుడు కచ్చితంగా రాజకీయ చర్చ జరిగిందన్నారు. కాబోయే అధ్యక్షురాలిగా షర్మిలకు సహకరిస్తానని.. తమ మధ్య విభేదాలు సృష్టించవద్దని రాధాకృష్ణకు సూచించారు. తెలంగాణ నుంచి ఆమెను పంపించడంలో విజయవంతమయ్యానని తనను అనవద్దని కోరారు. రెండు రాష్ట్రాల విషయానికి వస్తే కేసీఆర్, జగన్ ఒకటేనని.. తాను, షర్మిల ఒకటని అన్నారు. చంద్రబాబుతో బీజేపీ కలిస్తే ఎలా? అని రాధాకృష్ణ ప్రశ్నించగా.. ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉంది.. వారు స్పందిస్తారన్నారు.


More Telugu News