తండ్రి దెబ్బలు తాళలేక మూడేళ్ల చిన్నారి మృతి

  • మహేశ్వరంలోని అమీర్‌పేటలో బుధవారం దారుణం
  • నిద్రలేచిన మూడేళ్ల కొడుకు మాట వినకుండా బయటకు వెళ్లడంతో తండ్రి అకృత్యం
  • బయటున్న చిన్నారిని లోపలికి తీసుకొచ్చి కొట్టడంతో మృతి
  • భార్యపై అనుమానంతో ఈ దారుణానికి తెగబడ్డాడంటూ బాలుడి తండ్రిపై ఆరోపణ
తండ్రి దెబ్బలు తట్టుకోలేక మూడేళ్ల పసివాడు చనిపోయిన ఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని బూదూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన శివతో వివాహమైంది. వారికి నాలుగేళ్ల ప్రణయ్, మూడేళ్ల సంజు, 6 నెలల పాప ఉన్నారు. బతుకుదెరువు కోసం వారు మహేశ్వరంలోని అమీర్‌పేటకు వలస వచ్చారు. 

మేస్త్రీ పని చేసే శివ బుధవారం బయటకు వెళ్లగా లలితమ్మ ఆరు నెలల పాప, ప్రణయ్‌లను తీసుకుని కూరలు కొనుక్కునేందుకు బయటకు వచ్చింది. సంజూ ఇంట్లోనే నిద్రపోయాడు. ఇదిలా ఉంటే, కాసేపటికి శివ ఇంటికొచ్చి తలుపులు తీయగా సంజూ నిద్రలేచి బయటకు నడుచుకుంటూ వచ్చేశాడు. అతడిని బుజ్జగించినా వినకపోవడంతో లోపలికి తీసుకొచ్చి కొట్టాడు. ఈ క్రమంలో అతడి కుటుంబసభ్యులు సంజూను ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానంతోనే శివ ఈ దారుణానికి పాల్పడ్డాడని లలితమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


More Telugu News