మీ బిడ్డగా మీ ముందు నిలబడి విజ్ఞప్తి చేస్తున్నా... ఒక్క అవకాశం వచ్చింది.. వదులుకోవద్దు!: రేవంత్ రెడ్డి

  • 75 ఏళ్ల తర్వాత మీ పాలమూరు బిడ్డనైన తనకు సోనియమ్మ గొప్ప బాధ్యతను అప్పగించారన్న రేవంత్ రెడ్డి
  • పాలమూరు జిల్లాలో 14కు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించుకుందామని పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్
  • నాగర్ కర్నూలు, వనపర్తి సభలలో పాల్గొన్న రేవంత్ 
75 ఏళ్ల తర్వాత మీ పాలమూరు బిడ్డనైన తనకు సోనియమ్మ గొప్ప బాధ్యతను అప్పగించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్ కర్నూలులో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ను నడిపించే అవకాశాన్ని సోనియాగాంధీ తనకు ఇచ్చారని.. కాబట్టి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందని ఉమ్మడి పాలమూరు జిల్లా కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

పాలమూరు బిడ్డలు ఆలోచన చేయండి... మీ బిడ్డగా మీ ముందు నిలబడి విజ్ఞప్తి చేస్తున్నా... మనకు ఒక్క అవకాశం వచ్చింది... ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పాలమూరును పసిడి పంటల పాలమూరుగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలో 14కు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనదే అన్నారు.

వనపర్తిలో రేవంత్ రెడ్డి సభ

అంతకుముందు వనపర్తి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను చదువుకుంది వనపర్తిలోనే అని, తనకు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అభివృద్ధిలో ముందుండాల్సిన వనపర్తికి నిరంజన్ రెడ్డి చెడ్డపేరు తెచ్చారని మండిపడ్డారు. ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం ఎందుకు? అని ప్రశ్నించారు. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉన్నాయన్నారు. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా మీరు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News