కుక్కకాటుపై ఆసక్తికర తీర్పు వెలువరించిన పంజాబ్-హర్యానా హైకోర్టు

  • ప్రజలపై వీధి కుక్కల దాడులు
  • పంజాబ్-హర్యానా హైకోర్టులో 193 పిటిషన్లు
  • పరిహారం బాధ్యత ప్రభుత్వానిదేనన్న హైకోర్టు
  • పరిహారం నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం
దేశంలో వీధి కుక్కల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో పలువురు చిన్నారులు బలి కావడం తెలిసిందే. అంతెందుకు, వాగ్ బక్రీ టీ కంపెనీ యజమాని పరాగ్ దేశాయ్ సైతం వీధి కుక్కల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

తాజాగా, కుక్కకాటుకు సంబంధించి పంజాబ్-హర్యానా హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. ప్రజలపై వీధి కుక్కల దాడుల నేపథ్యంలో హైకోర్టులో 193 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీధుల్లో శునకాలు, ఇతర జంతువుల దాడిలో పౌరులు గాయపడితే ప్రభుత్వం తప్పక పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.

ఓ వ్యక్తి కుక్కకాటుకు గురైనప్పుడు ఒక్కో పంటి గాటుకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గాయం మరింత తీవ్రమైనది అయితే రూ.20 వేల వరకు పరిహారం అందించాలని నిర్దేశించింది. సందర్భాన్ని బట్టి ఈ పరిహారాన్ని ప్రభుత్వ విభాగాల నుంచి, ప్రైవేటు వ్యక్తుల నుంచి రాబట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. 

అంతేకాదు, శునకాలు, ఇతర జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పంజాబ్, హర్యానా, చండీగఢ్ పాలక వర్గాలకు సూచన చేసింది.


More Telugu News