తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్రమోదీ కావాలని కోరుకుంటున్నారు: లక్ష్మణ్

  • ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది గమనించి ఎన్నుకోవాలన్న లక్ష్మణ్
  • బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల మంచి కోరే పార్టీలు కాదని విమర్శలు
ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది గమనించి.. ఆలోచించి ఎన్నుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారన్నారు. 

బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయన్నారు. అవి రాష్ట్ర ప్రజల మంచి కోరే పార్టీలు కావన్నారు. పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దాని కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లలో చేయని పనులను కేవలం పదిరోజుల్లో చేస్తామని కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మరని గుర్తుంచుకోవాలన్నారు.


More Telugu News