డేవిడ్ వార్నర్‌ కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్

  • అల్లు అర్జున్ ను విపరీతంగా అభిమానించే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
  • నేడు వార్నర్ పుట్టినరోజు
  • ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో స్పెషల్ పోస్టు పెట్టిన బన్నీ 
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడడం వల్ల టాలీవుడ్ సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే వార్నర్ కు ఎనలేని అభిమానం. బన్నీ సినిమాలన్నా, అతడి సినిమాల విశేషాలన్నా వార్నర్ కు చాలా ఇష్టం. వార్నర్ సోషల్ మీడియా ఖాతాలో చూస్తే పుష్పతో పాటు అల్లు అర్జున్ ఇతర చిత్రాల స్పూఫ్ వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తాయి. అంతెందుకు, ఈ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ప్రతిసారీ వార్నర్ తగ్గేదే లే అంటూ గడ్డం కిందికి చేయి పోనివ్వడం అందరూ చూసే ఉంటారు. 

ఇక, తన అభిమానులతో అల్లు అర్జున్ సత్సంబంధాలను కొనసాగిస్తుంటాడని తెలిసిందే. వార్నర్ వంటి వీరాభిమాని పట్ల బన్నీ కూడా అంతే అభిమానం చూపిస్తుంటాడు. సందర్భాన్ని బట్టి ఇరువురు సోషల్ మీడియాలో ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు. 

అసలు విషయానికొస్తే... నేడు (అక్టోబరు 27) డేవిడ్ వార్నర్ పుట్టినరోజు. దాంతో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వార్నర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. "క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ కు ఇలాంటి సంతోషదాయక పుట్టినరోజులు మరెన్నో రావాలి. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కాలని, ఇంకా మరెన్నో ఘనతలు అందుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ బన్నీ పోస్టు చేశాడు.


More Telugu News