డికాక్ సెంచరీ... ఆసీస్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన దక్షిణాఫ్రికా

  • లక్నోలో ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
  • 106 బంతుల్లో 109 పరుగులు చేసిన డికాక్
లక్నోలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్... దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ, ఐడెన్ మార్ క్రమ్ అర్ధసెంచరీ సాయంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో డికాక్ ఆటే హైలైట్. డికాక్ 106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. మార్ క్రమ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు సాధించాడు. కెప్టెన్ టెంబా బవుమా 35, వాన్ డర్ డుస్సెన్ 26, హెన్రిచ్ క్లాసెన్ 29, మార్కో యాన్సెన్ 26, డేవిడ్ మిల్లర్ 17 పరుగులు చేశారు. 

సఫారీ ఇన్నింగ్స్ లో ఆసీస్ ఫీల్డర్లు పలు క్యాచ్ లు విడవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్లో నాణ్యమైన ఫీల్డింగ్ కు పేరుగాంచిన ఆసీస్ ఒకే ఇన్నింగ్స్ లో ఇన్ని క్యాచ్ లు వదలడం చాలా అరుదు. 

ఇక, ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, మ్యాక్స్ వెల్ 2, హేజెల్ వుడ్ 1, కమిన్స్ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు. చివర్లో ఆసీస్ బౌలర్లు వ్యూహాత్మకంగా బంతులు విసరడంతో సఫారీ రన్ రేట్ కాస్త తగ్గింది. చివరి 5 ఓవర్లలో ఆసీస్ 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది.


More Telugu News