బాబోయ్ ఇది జైలా.. బిట్‌కాయిన్ తయారీ మిషన్లు, అమ్మాయిలు, పేలుడు పదార్థాలు, మెషీన్ గన్లు, రాకెట్ లాంచర్లు.. ఇంకా చెప్పలేనన్ని!

  • వెనిజులాలోని టోకోరన్ జైలుపై 11 వేల మంది పోలీసుల దాడి
  • జైలును నైట్‌క్లబ్‌గా, ఆటస్థలంగా, జూగా మార్చేసిన ముఠా
  • ఏడాదికిపైగా ప్లాన్ చేసి దాడిచేసిన పోలీసులు
  • ఏసీలు, టీవీలు, మైక్రోవేవ్‌లు, డ్రగ్స్.. గుట్టలుగా స్వాధీనం
వెనిజులాలోని ఓ జైలు నుంచి పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ మైనింగ్ మెషీన్లు, రాకెట్ లాంచర్లు బయటపడడం సంచలనమైంది. జైలు గదిని ఆటస్థలంగా, నైట్ క్లబ్‌గా, జూగా మార్చేసిన ముఠా నుంచి వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 వేల మంది పోలీసులు, సైనికులు ట్యాంకులు, సాయుధ వాహనాలతో పెద్ద టోకోరన్ జైలుపై గురువారం దాడిచేసి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 

ఈ ఆపరేషన్‌లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఏడాదికిపైగా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు అంతర్గత, న్యాయశాఖ మంత్రి రెమిగియో సెబాలస్ తెలిపారు. జైలు గది నుంచి స్నిపర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు, గ్రేనేడ్లతోపాటు కొకైన్, గంజాయి, ఖరీదైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. అంతేకాదు, ఖైదీలతో కలిసి ఉంటున్న వారి భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్‌ను బయటకు పంపినట్టు పేర్కొన్నారు. 

జైలు నుంచి స్వాధీనం చేసుకున్న వాటిని బయట మీడియాకు ప్రదర్శించారు. అందులో బకెట్ల కొద్దీ బులెట్లు, మెషీన్ గన్ బులెట్ బెల్టులు, క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్లు తయారుచేసే మిషన్లు వంటివి ఉన్నాయి. అలాగే, టీవీలు, మైక్రోవేవ్‌లు, ఏసీలు ఉన్నాయి. వాటిని చూసిన మహిళలు అవన్నీ తమవేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాదు, జైలును జూలా మార్చేశారని,  ఖైదీలు నిప్పు అంటించడంతో కొన్ని జంతువులు చనిపోయినట్టు మంత్రి తెలిపారు. ఖైదీలకు సహకరించిన నలుగురు జైలు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.


More Telugu News