ఆసియాకప్: దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. మీరు రెడీనా!

  • నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
  • ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుగా ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్
  • షహీన్ అఫ్రిది రూపంలో బౌలింగ్ అస్త్రం
  • భారత్‌లో రోహిత్, గిల్, కోహ్లీ ఆడితే విధ్వంసమే
  • పాక్‌పై చెలరేగే విరాట్ మరోమారు అదే జోరు ప్రదర్శించాలని కోరుకుంటున్న అభిమానులు
ఆసియాకప్‌లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న మెన్ ఇన్ గ్రీన్‌కు షహీన్ అఫ్రిది రూపంలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్ ఉన్నాడు. భారత్‌కు అతడు సవాలు విసిరే అవకాశం ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను అతడు దారుణంగా దెబ్బ కొట్టాడు. అలాగే, హరీస్ రవూఫ్, యువ పేసర్ నసీమ్ షాలు కూడా చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి రోహిత్ సేన ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా నష్టమే.

టీమిండియా విషయానికి వస్తే ఓపెనర్లు రోహిత్, శుభమన్, కోహ్లీ కనుక నిలదొక్కుకుంటే పాక్ కకావికలం కాక తప్పదు. అయితే, గిల్ పాకిస్థాన్‌తో ఆడడం ఇదే తొలిసారి కాబట్టి అందరి చూపు అతడిపైనే ఉంది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తోపాటు మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా కీలకం కానున్నాడు. చివర్లో జడేజా ఎలాగూ ఉన్నాడు కాబట్టి ఏ రకంగా చూసినా జట్టు బలంగా ఉన్నట్టే.  

పాకిస్థాన్ అంటే చెలరేగిపోయే టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అదే కసి ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాక్‌తో 13 వన్డేలు ఆడిన విరాట్ రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 536 పరుగులు చేశాడు. 10 టీ20ల్లో 488 పరుగులు చేశాడు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరగనున్న పల్లెకెలెలో నేడు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


More Telugu News