గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో కేసీఆర్‌కు దడ పుట్టింది: ధర్మపురి అర్వింద్

  • కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడించి పంపిస్తామని వ్యాఖ్య
  • ఏడు స్థానాలకు ఏడింటిని బీజేపీ గెలుస్తుందన్న ధర్మపురి అర్వింద్
  • కేసీఆర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా అభ్యర్థుల పరిస్థితి ఊహించుకోవాలన్న ఎంపీ
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ అన్నారు. నాలుగు నియోజకవర్గాలు మినహా మిగతా వాటికి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్వింద్ మాట్లాడుతూ... కామారెడ్డిలో కేసీఆర్‌ను తప్పకుండా ఓడించి పంపిస్తామన్నారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కామారెడ్డికి వస్తున్నారని విమర్శించారు.

తాను గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని తమ పార్టీకి చెందిన ఈటల రాజేందర్ ప్రకటించినప్పటి నుంచి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, అందుకే కామారెడ్డికి పారిపోయి వస్తున్నారన్నారు. గజ్వేల్‌కు వస్తున్నానని ఈటల చెప్పడంతో దడ పుట్టిందన్నారు. ఇది గజ్వేల్ ప్రజలను అవమానించినట్లే, వారిపై కేసీఆర్‌కు నమ్మకం లేనట్లే అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి గజ్వేల్ నుంచి పారిపోయి కామారెడ్డికి వస్తున్నాడన్నారు. కేసీఆర్ ఇంకాస్త ముందుకు వస్తే తన నియోజకవర్గం ఉందన్నారు. నిజామాబాద్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడింటిని బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

స్వయంగా ముఖ్యమంత్రే రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నాడంటే మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి ఊహించుకోవాలన్నారు. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అర్వింద్ ఖండించారు. మహారాష్ట్ర గురించి ఏం తెలుసునని కేసీఆర్ అక్కడకు వెళ్తున్నారో చెప్పాలన్నారు.


More Telugu News