షాకింగ్..ప్రముఖ వ్యాపారవేత్త కాళ్లు విరగ్గొట్టించిన కుమార్తె..!

  • మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా మధ తాలూకాలో ఘటన
  • రూ.60 వేల రూపాయల సుపారితో పన్నాగం అమలు
  • కుట్రలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్టు చేసిన పోలీసులు
మహారాష్ట్రకు చెందిన ఓ యువతి తన కన్న తండ్రిపైనే దారుణానికి ఒడిగట్టింది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడంటూ ఆయన కాళ్లు విరగ్గొట్టించింది. సోలాపూర్ జిల్లా మధ తాలూకాకు చెందిన మహేంద్ర షా స్థానికంగా పేరు మోసిన వ్యాపారవేత్త. ఆయన కుమార్తె సాక్షి, చైతన్య అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే, తమకు అడ్డుగా ఉన్న తన తండ్రి కాళ్లు విరగ్గొట్టించేందుకు భారీ కుట్ర పన్నింది. రూ.60 వేల సుపారీ ఇచ్చి నలుగురు రౌడీలను రంగంలోకి దించింది. 

ఈ క్రమంలో ఆమె తొలుత పూణెకు వెళ్లి ఆదివారం రాత్రి మధకు వచ్చింది. స్థానిక బస్ స్టాండ్‌కు చేరుకున్నాక తండ్రికి ఫోన్ చేసి, వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కూతురి పన్నాగం పసిగట్టలేకపోయిన తండ్రి కారులో వచ్చి కూతుర్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో కూతురు తాను మూత్రవిసర్జన చేయాలంటూ తండ్రిని వాడచివాడి గ్రామ సమీపంలో కారు ఆపమని చెప్పింది. అప్పటికే వారి కారును కొందరు వెంబడిస్తున్నారు. ఈ విషయాలు తెలియని ఆయన కూతురు చెప్పినట్టు కారు ఆపారు. 

వారిని వెంబడిస్తున్న దుండగులు యువతి అలా పక్కకు వెళ్లగానే మహేంద్ర షాపై ఒక్కసారిగా దాడి చేసి ఇష్టారీతిన కొట్టారు. ఈ దాడిలో ఆయన తలపై తీవ్రగాయం కావడంతో పాటూ కాళ్లు కూడా విరిగిపోయాయి. దెబ్బలు తాళలేక ఆయన ఆర్తనాదాలు చేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత స్థానికులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కుమార్తె పన్నిన కుట్రను గుర్తించారు. ఈ కేసులో యువతితో పాటూ ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్టు గుర్తించారు. ప్రేయసీప్రియులతో పాటూ వ్యాపారవేత్తపై దాడిచేసిన నలుగురినీ అరెస్ట్ చేశారు.


More Telugu News