ఏపీ, బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు: ప్రధాని మోదీ

  • పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం
  • ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన వైనం
  • మిమ్మల్నిగెలిపించకపోవడం ప్రజల తప్పు కాదు... మీరు చేసుకున్న కర్మ అంటూ వ్యాఖ్యలు
పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసుకోవడం మూలనబడ్డ బండికి రంగు వేయడం వంటిదేనని ఎద్దేవా చేశారు. ఎన్ని రంగులు వేసినా, పైపూతలు పూసినా బండి నడవదు కదా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

మిమ్మల్ని గెలిపించకపోవడం ప్రజల తప్పు కాదు... మీరు చేసుకున్న కర్మ అని విమర్శించారు. తమిళనాడు, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్, తమిళనాడు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ గెలిచిందే లేదు... వాళ్లకు అక్కడ ఓటమి తప్ప మరో ఫలితం కనిపించడంలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరని హేళన చేశారు. ఇక, ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటుపైనా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

"ఇటీవల మీరు బెంగళూరులో యూపీఏకి కర్మకాండలు నిర్వహించారు. కర్మకాండలను కూడా మీరు పండుగలా చేసుకున్నారు. NDAకి రెండు Iలు అదనంగా చేర్చి INDIA పేరుతో మళ్లీ 16 పార్టీలే ఏకతాటిపైకి వచ్చారు. INDIA లోని ఒక I 16 పార్టీల అహంకారానికి సూచిక. మరో I ఒక ప్రధాన కుటుంబం అహంకారానికి సూచిక. కొత్తగా ఎన్ని జట్లు కట్టినా ఓటమి తప్పదు... ఇది ఖాయం చేసుకోండి. మీ కూటమిలోనే భారత్ అస్తిత్వాన్ని ప్రశ్నించేవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లతో బండి కదులుతుందా? 

ఒక పెద్ద పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించారు... వారి పని మాత్రం ఎక్కడా కనిపించదు. ఆసుపత్రుల పేర్లు, క్రీడల అవార్డుల పేర్లు, రహదారుల పేర్లు అన్నింటికీ వారి పేర్లే పెట్టుకుంటారు. ఆసుపత్రికి వారి పేరు ఉంటుంది కానీ చికిత్స మాత్రం దొరకదు. రహదారులకు పేర్లు పెట్టుకుంటారు కానీ, కొత్తవాటి నిర్మాణం గురించి ఆలోచించరు. వారి పేరుతో అవార్డులు ఉంటాయి కానీ, క్రీడాకారులకు మాత్రం ప్రోత్సాహం ఉండదు. 

ఆ కుటుంబ వ్యవహార శైలి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. ఆ కుటుంబం గురించి, వారి అహంకారం గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంది. మూడు రంగుల జాతీయ జెండాను కాంగ్రెస్ తన జెండాగా మార్చుకుంది. ఇతరుల కష్టాలను, విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. 1920 నుంచి జరుగుతోంది ఇదే. ఎన్నికల గుర్తులను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది. 

ఇది ఇండియా కూటమి కాదు, అహంకార కూటమి. ఆ కూటమిలో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలనుకునేవారే. 21 రాష్ట్రాల్లో ఈ కూటమిలోని పార్టీల మధ్య సంబంధాలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి. అక్కడ కొట్లాడుకుంటారు... ఇక్కడికి వచ్చి కలిసిపోతారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కాంగ్రెస్ వర్గీయులు, కమ్యూనిస్టులు పరస్పరం దాడులు చేసుకుంటారు... ఇక్కడికి వచ్చి చేతులు కలుపుతారు. 

మీ చర్యలను, మీ చేష్టలను దేశమంతా గమనిస్తోంది. మీరు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు" అంటూ ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది.


More Telugu News