తోటి విద్యార్థుల కులం, మార్కుల గురించి అడగొద్దు.. ఐఐటీ బాంబే మార్గదర్శకాలు

  • కుల వివక్షతో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో అధికారుల కొత్త మార్గదర్శకాలు
  • ఇతర విషయాల్లో తోటి వారి ఆసక్తి గురించి తెలుసుకోవచ్చని సూచన
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఐఐటీ బాంబే తాజాగా విద్యార్థులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సహ విద్యార్థుల కులం గురించి అడగొద్దని స్పష్టం చేసింది. దీనికి బదులు వారికి నచ్చిన సినిమాలు, పాటలు, ఇతర విషయాల గురించి తెలుసుకోవచ్చని సూచించింది. కుల వివక్ష బారినపడ్డానన్న ఆవేదనతో ఇటీవల ఓ బీటెక్ విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

అక్కడ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి ఫిబ్రవరి 12న తన హాస్టల్‌ ఏడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే క్యాంపస్‌లో కుల వివక్ష ఎదుర్కొన్నానంటూ అతడు అంతకుమునుపు తన తల్లికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తన కులం గురించి తెలియగానే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నాడని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో అధికారులు క్యాంపస్‌లో కుల వివక్ష వ్యతిరేక పోస్టర్లు అతికించారు. తోటి విద్యార్థుల కులం గురించి వాకబు చేయకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అంతేకాకుండా, వారి జేఈఈ స్కోరు, గేట్ స్కోర్ గురించి కూడా అడగకూడదని స్పష్టం చేశారు. ఈ స్కోర్లను బట్టి కూడా విద్యార్థుల కులాన్ని అంచనా వేసే అవకాశం ఉండటం ఈ సూచనకు కారణమని తెలుస్తోంది. కాగా, కుల, మత, లింగ భేదాల ఆధారంగా ఎద్దేవా చేసేలా ప్రవర్తించకూడదని అధికారులు సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


More Telugu News