ఆదిపురుష్ ఇప్పటికే విడుదలైంది.. విచారణకు అర్జంటు ఏముంది?: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్య

  • స్ట్రీమింగ్ నిలిపివేయాలని హిందూసేన జాతీయ అధ్యక్షుడి పిటిషన్
  • అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ విజ్ఞప్తి
  • 30న విచారిస్తామని వెల్లడించిన ఢిల్లీ హైకోర్టు
ఆదిపురుష్ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ హిందూసేన జాతీయ అధ్యక్షుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నిరాకరించింది.

ఆదిపురుష్ సినిమాపై అత్యవసర విచారణ జరపాలని, ఈరోజు లేదా రేపు లేదా మరుసటి రోజు విచారణకు జాబితా చేయాలంటూ పిటిషనర్ విష్ణు గుప్తా చేసిన అభ్యర్థనను న్యాయమూర్తులు తారా వితస్తా గంజు, అమిత్ మహాజన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ తిరస్కరించింది.

ఈ పిల్ ను జూన్ 30న విచారిస్తామని తెలిపింది. ఆలస్యం చేస్తే పిటిషన్ యొక్క ఉద్దేశ్యం వీగిపోతుందని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు.

దీనికి స్పందించిన న్యాయస్థానం.. ఆదిపురుష్ సినిమా ఇప్పటికే విడుదలైందని, విడుదల తేదీ కూడా ముందుగానే తెలిసిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర విచారణకు తీసుకోలేమని తెలిపింది.

"ఈ సినిమా ఇప్పటికే విడుదలైనందున ఏం కోరుకుంటున్నారు? ప్రస్తుతానికి, ఇది అత్యవసరమని మేము భావించడం లేదు. దయచేసి ఆ రోజు (జూన్ 30) తిరిగి రండి" అని కోర్టు పేర్కొంది.

పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ఇందులో అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయని, నేపాల్ కూడా ఈ చిత్రాన్ని నిషేధించిందని గుర్తు చేశారు. సమస్యాత్మక భాగాలను తొలగిస్తామని దర్శకుడు ఓం రౌత్ గతంలో హామీ ఇచ్చారని, అయితే అలా చేయకుండా సినిమాను విడుదల చేశారని పేర్కొన్నారు.

విష్ణుగుప్తా పిటిషన్ ప్రకారం వాల్మీకి, తులసీదాస్ వంటి రచయితలు రచించిన రామాయణంలోని వర్ణనకు విరుద్ధంగా ఆదిపురుష్ ఉందని, ఇది హిందువుల మనోభావాలను గాయపర్చేలా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమా సర్టిఫికేషన్‌ను రద్దు చేసి వెంటనే నిషేధించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.


More Telugu News