భక్తులపై పోలీసుల లాఠీచార్జ్.. రగులుతున్న మహారాష్ట్ర.. వీడియో ఇదిగో!

  • వార్కారీ భక్తులపై లాఠీచార్జి దృశ్యాలు వైరల్
  • ఔరంగజేబు దీనికి భిన్నంగా ఏమీ ప్రవర్తించలేదన్న సంజయ్ రౌత్
  • మహారాష్ట్రలోకి మొఘలులు మళ్లీ వచ్చారని ఎద్దేవా
  • హిందుత్వ ప్రభుత్వం ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్య
పండార్పూర్‌లోని వార్కారీ భక్తులపై పోలీసులు లాఠీచార్జికి దిగిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయంగా అట్టుడుకుతోంది. విఠోబా (శ్రీకృష్ణుడు)లైన వార్కారీ భక్తులపై లాఠీ చార్జి జరగడం ఇదే తొలిసారి. పూణెకు 22 కిలోమీటర్ల దూరంలోని అలండిలో ఉన్న శ్రీ క్షేత్ర ఆలయంలోకి భక్తులు వెళ్తున్న సమయంలో పోలీసులకు, వారికి మధ్య గొడవ జరిగింది. అది క్రమంగా పెరిగి పెద్దది కావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది. భక్తులపై లాఠీచార్జి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి.

పోలీసులు మాత్రం దూసుకొస్తున్న భక్తులను అదుపు చేసేందుకు తాము స్వల్పంగా లాఠీచార్జ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు 75 మందికి మాత్రమే అనుమతి ఉండగా 400 మంది బలవంతంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారని, అందుకనే లాఠీచార్జ్ చేసినట్టు వివరించారు. అది లాఠీ చార్జి కాదని, చిన్నపాటి గొడవ మాత్రమేనని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. వార్కారీలపై లాఠీచార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. భక్తులు బారికేడ్లను విరగ్గొట్టడంతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. 

వార్కారీ భక్తులపై జరిగిన దాడిపై శివసేన సీనియర్ ఎంపీ సంజీవ్ రౌత్ మండిపడ్డారు. హిందుత్వ ప్రభుత్వం ముసుగు తొలగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔరంగజేబు కూడా దీనికి భిన్నంగా ప్రవర్తించలేదని అన్నారు. మహారాష్ట్రలోకి తిరిగి ముస్లింలు వచ్చేశారని విమర్శించారు. భక్తులపై దాడిని ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్ కూడా ఖండించారు.


More Telugu News