తాలిబన్ల కళ్లుగప్పి ఐఐటీ డిగ్రీ అందుకున్న ఆఫ్ఘన్ యువతి

  • ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిల విద్యపై తీవ్ర ఆంక్షలు
  • 1 నుంచి 6వ తరగతి వరకే అమ్మాయిలకు విద్య
  • మద్రాస్ ఐఐటీ నుంచి డిస్టెన్స్ లో పీజీ చేసిన బెహిస్తా
  • తన నివాసంలోనే సీక్రెట్ గా ప్రయోగశాల ఏర్పాటు
ఆఫ్ఘనిస్థాన్ లో మత ఛాందసత్వానికి ప్రతీకలా నిలిచే తాలిబన్ల పాలనలో అమ్మాయిల చదువుపై ఎన్ని ఆంక్షలో! అమ్మాయిలు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకే చదువుకోవాలని తాలిబన్ పాలకులు ఇటీవలే హుకుం జారీ చేశారు.

మిడిల్ స్కూళ్లు, హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిల చదువుపై నిషేధం ఉంది. అంతెందుకు, ఆఫ్ఘన్ మహిళ ఒంటరిగా వీధుల్లోకే వెళ్లకూడదు. పురుషుడు తోడుంటే తప్ప ఇల్లు దాటి బయటికి అడుగుపెట్టకూడదు. 

అలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం మామూలు విషయం కాదు. ఆ యువతి పేరు బెహిస్తా ఖైరుద్దీన్. ఆఫ్ఘనిస్థాన్ లోని మారుమూల ప్రాంతంలో ఉండే బెహిస్తా కెమికల్ ఇంజినీరింగ్ లో పీజీ పూర్తి చేయడం ఓ స్ఫూర్తిదాయక గాథ. 

తాలిబన్ పాలనలో ఇళ్లలోనే మగ్గిపోతున్న ఎందరో యువతులకు బెహిస్తా ఇప్పుడు ప్రేరణలా నిలుస్తోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బెహిస్తాకు భారత్ లోని మద్రాస్ ఐఐటీ ఓ ఆశాదీపంలా కనిపించింది. దూరవిద్యావిధానంలో ఆమె మద్రాస్ ఐఐటీ నుంచి పీజీ విద్యాభ్యాసం చేసింది. అందుకోసం బెహిస్తా తన ఇంటిలోనే రహస్య ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుంది. 

అంతరాయాలతో కూడిన వైఫై కనెక్షన్, కొన్ని బీకర్లు, తన సోదరి నుంచి తీసుకున్న ఓ పాత మైక్రోవేవ్ ఓవెన్... వీటి సాయంతో రసాయన ప్రయోగాలు నిర్వహించి ఎంతో పట్టుదలతో కెమికల్ ఇంజినీరింగ్ పోస్టుగ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణురాలైంది. 

ఆమె పీజీ రెండేళ్ల పాటు ఎంతో రహస్యంగా సాగింది. ఈ క్రమంలో ఏ చిన్న ఆసరా దొరికినా బెహిస్తా విడిచిపెట్టలేదు. తాలిబన్లకు దొరికిపోతే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఊహకు అందని విషయం... అయినప్పటికీ ప్రాణాలకు తెగించిన బెహిస్తా మద్రాస్ ఐఐటీ ద్వారా పీజీ పూర్తి చేసింది.


More Telugu News