జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వే ఆదేశాల నిలుపుదల... జాగ్రత్తగా అడుగులు వేయాలన్న సుప్రీంకోర్టు

  • ఈ ఏడాది ఆరంభంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం వంటి ఆకృతి గుర్తింపు
  • సైంటిఫిక్ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన మసీదు కమిటీ
  • హైకోర్టు నిర్ణయాన్ని అమలు చేయొద్దంటూ సుప్రీం ఉత్తర్వులు
వారణాసిలోని కాశీ విశ్వనాధుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగం వయసును నిర్ధారించడానికి సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని, కార్బన్ డేటింగ్ తదితర పరీక్షలు జరిపి ఆ ఆకృతి ఏ కాలం నాటిదో తేల్చాలని మే 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ కొనసాగించింది. 

జ్ఞానవాపి మసీదులో శివలింగానికి శాస్త్రీయ పరీక్షలు జరపడంలో తొందరపాటు వద్దని, ఈ వ్యవహారంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. 

అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఎదురయ్యే చిక్కులు ఏవైనా ఉంటే వాటిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, తదుపరి విచారణ వరకు హైకోర్టు ఆదేశాల అమలును వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, హిందూ పిటిషన్లరకు నోటీసులు జారీ చేసింది. 

ఈ ఏడాది ఆరంభంలో వారణాసి లోని ఓ స్థానిక కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వే నిర్వహించగా, శివలింగం రూపంలోని ఆకృతి బయటపడింది. కాగా, సైంటిఫిక్ సర్వే పట్ల మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి అది శివలింగం కాదని, మతపరమైన క్రతువులు నిర్వహించే ఓ ఫౌంటెన్ తరహా నిర్మాణం అని మసీదు కమిటీ వాదిస్తోంది.


More Telugu News