జీపీఎస్ ఫాలో అవుతూ కారును సముద్రంలోకి దింపిన మహిళ! వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

  • నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్
  • జీపీఎస్ సూచనలు అనుసరిస్తూ తన కారును సముద్రంలోకి నడిపిన మహిళ
  • మహిళ మద్యం మత్తులో ఇలా చేసుంటుందని నెటిజన్ల అనుమానం
  • ఆమెకు మతిమరుపు వ్యాధి ఉండి ఉండొచ్చని ఇంకొందరి సందేహం
జీపీఎస్ సూచనలు ఫాలో అవుతూ ఓ మహిళ తన కారును ఏకంగా సముద్రంలోకి తోలిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ‘‘అప్పుడు వర్షం పడుతుండటంతో తడవకుండా ఉండేందుకు మేమంతా ఓ పక్కన కూర్చున్నాం. ఇంతలో ఓ మహిళ కారు నడుపుకుంటూ మా బోటు పక్క నుంచి వెళ్లింది. ఆమె తన కారును మంచి స్పీడుతో నేరుగా సముద్రంలోకి తోలడం చూసిన మాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

ఆ సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, కారు సముద్రంలో మునిగిపోవడాన్ని అక్కడున్న వారు గమనించి వెంటనే ఆ మహిళలను రక్షించారు. ఆ ఇద్దరినీ జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇక, ఆ మహిళ కారును సముద్రంలోకి ఎందుకు తోలిందో అర్థంకావడంలేదంటూ ఈ వీడియో చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. కారు తోలుతున్న మహిళ మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని ఇంకొంతమంది సందేహం వ్యక్తం చేశారు.

మరికొందరు మాత్రం ఆమెకు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాధి బారినపడ్డ వారు ఒక్కోసారి సరయిన నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చారు. మహిళ ఏ జీపీఎస్ ఫాలో అవుతోందో తెలుసుకోవాలని ఉందంటూ మరికొందరు సరదా కామెంట్స్ కూడా చేశారు. మరి నెటిజన్లను ఇంతగా ఆశ్చర్యపరుస్తున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


More Telugu News