కబాబ్ రుచిగా లేదని వంటమనిషి హత్య

  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో బుధవారం షాకింగ్ ఘటన
  • మద్యం మత్తులో కబాబ్ షాపునకు వచ్చిన నిందితులు
  • కబాబ్ రుచిగా లేదంటూ షాపు యజమానితో ఘర్షణ
  • డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోయేందుకు యత్నం
  • వారి వద్ద డబ్బులు తీసుకురావాలంటూ వంట మనిషిని పంపించిన యజమాని
  • తన వద్దకు వచ్చిన వంట మనిషిని కాల్చిచంపిన నిందితుడు
కబాబ్ రుచిపై తలెత్తిన వివాదం చివరకు వంట మనిషి హత్యకు దారితీసింది. నమ్మశక్యంకాని ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బరేలీలోని ప్రేమ్‌నగర్‌లో ఓ దుకాణానికి బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ కబాబ్ కొనుగోలు చేశారు. ఆ తరువాత కబాబ్ రుచి బాగాలేదంటూ వారు దుకాణం యజమాని అంకుర్ సబర్వాల్‌తో గొడవకు దిగారు. చివరకు బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. 

దీంతో, వారి నుంచి కబాబ్ డబ్బులు తీసుకురావాలంటూ అంకుర్ తన వంట మనిషి నసీర్ అహ్మద్‌ను ఆదేశించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తమ వద్దకు వచ్చిన నసీర్ అహ్మద్‌‌ను తుపాకీతో కణతపై కాల్చాడు. దీంతో, నసీర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


More Telugu News