చెన్నై సూపర్ కింగ్స్ కు ఆఖరి బంతికి షాకిచ్చిన పంజాబ్ కింగ్స్

  • చెపాక్ స్టేడియంలో సస్పెన్స్ థ్రిల్లర్
  • 4 వికెట్లతో నెగ్గిన పంజాబ్ కింగ్స్
  • ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా, సికిందర్ రజా విన్నింగ్ షాట్
  • ఫీల్డర్లు బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపినా 3 పరుగులు తీసిన రజా, షారుఖ్
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు సొంతగడ్డపై షాక్ తగిలింది. నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ దే పైచేయి అయింది. 

201 పరుగుల లక్ష్యఛేదనలో... ఆఖరి ఓవర్ లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉండగా... సికిందర్ రజా (13 నాటౌట్), షారుఖ్ ఖాన్ (2) ఆ పని విజయవంతంగా పూర్తి చేశారు. 

చివర్లో 1 బంతికి 3 పరుగులు తీయాల్సి ఉండగా, పతిరణ వేసిన స్లో డెలివరీని సికిందర్ రజా లెగ్ సైడ్ కొట్టాడు. చెన్నై ఫీల్డర్లు ఆ బంతిని బౌండరీ దాటకుండా ఆపేసినప్పటికీ... క్రీజులో ఉన్న సికిందర్ రజా, షారుఖ్ ఖాన్ 3 పరుగులు తీయడంతో విజయం పంజాబ్ నే వరించింది.

 సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (42), కెప్టెన్ శిఖర్ ధావన్ (28) తొలి వికెట్ కు 50 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. 

ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ (24 బంతుల్లో 40), శామ్ కరన్ (29), జితేశ్ శర్మ (10 బంతుల్లో 21) దూకుడుగా ఆడి రన్ రేట్ తగ్గకుండా చేశారు. ధోనీ వ్యూహాల కారణంగా పంజాబ్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ, చివర్లో సికిందర్ రజా, షారుఖ్ ఖాన్ పట్టుదలగా నిలిచి పంజాబ్ ను విజేతగా నిలిపారు. 

కాగా, ఈ మ్యాచ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించారు. సాధారణంగా తెల్ల చొక్కా, పంచెలో దర్శనమిచ్చే ఆయన, ఈ మ్యాచ్ కోసం క్యాజువల్ దుస్తుల్లో వచ్చారు. 

సొంతగడ్డపై 200 పరుగులు చేసి కూడా ఓడిపోవడం ధోనీ సేనకు మింగుడుపడని విషయం. ఈ మ్యాచ్ లో కీపింగ్ చేస్తున్న సమయంలో ధోనీ మోకాలి గాయంతో ఇబ్బందిపడడం కనిపించింది.

ఐపీఎల్ లో 1000వ మ్యాచ్

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ లో భాగంగా ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా బీసీసీఐ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి క్రికెట్ దిగ్గజాలను గౌరవించింది. ఇక, ఈ మ్యాచ్ విషయానికొస్తే... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరుకు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా నిలుస్తోంది.


More Telugu News