ఒపెక్ నిర్ణయంతో మళ్లీ చమురు ధరల మంట!

  • రోజువారీగా 1.16 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయం
  • 85 డాలర్లకు దూసుకుపోయిన బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ ధర
  • డిసెంబర్ నాటికి 95 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనా
చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తీసుకున్న తాజా నిర్ణయం సమీప కాలంలో మళ్లీ చమురు ధరల ఆజ్యానికి కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది చమురు ధరలు బ్యారెల్ కు గరిష్ట స్థాయికి వెళ్లిన తర్వాతి నుంచి గణనీయంగా తగ్గాయి. ఇటీవలే బ్యారెల్ చమురు ధర 70 డాలర్ల దిగువకు పడిపోయింది. ధరలు మరింత పడిపోకుండా ఉండేందుకు ఒపెక్ సమాఖ్య రోజువారీగా 1.16 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు మొత్తం మీద 3.66 మిలియన్ బ్యారెళ్ల రోజువారీ ఉత్పత్తి కోతకు నిర్ణయం తీసుకున్నట్టు అయింది. ఇది ప్రపంచ చమురు డిమాండ్ లో 3.7 శాతానికి సమానం.

ఒపెక్ తాజా నిర్ణయంతో 2023 డిసెంబర్ నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 95 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా విడుదల చేసింది. 2024 డిసెంబర్ కు బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. ఒపెక్ నిర్ణయం తర్వాత బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ 84.86 డాలర్లకు దూసుకుపోవడం గమనార్హం. చమురు ఉత్పత్తి తగ్గింపు నిర్ణయం మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ధరలకు మద్దతునిస్తుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ 90-95 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.


More Telugu News