92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అవుతున్న మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్!

  • నాలుగో భార్యతో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా గడకముందే ప్రియురాలితో నిశ్చితార్థం
  • ఇదే తనకు చివరి వివాహమని వ్యాఖ్యలు
  • 2016లో తనకంటే 25 ఏళ్ల చిన్నదైన జెర్రీహాల్‌తో నాలుగో పెళ్లి
  • రెండో భార్య మరియాకు రూ.1.7 బిలియన్ డాలర్ల భరణం
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 92 ఏళ్ల వయసులో ఐదో వివాహానికి సిద్ధమవుతున్నారు. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన ఆయన తన ప్రియురాలు అయిన యాన్‌లెస్లీ స్మిత్‌తో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఇంకో పెళ్లి చేసుకోబోనని, ఇదే తనకు చివరి వివాహమని కూడా స్పష్టం చేశారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.

జెర్రీ నుంచి గతేడాది ఆగస్టులోనే విడాకులు తీసుకున్న మర్దోక్ స్వల్ప కాలంలోనే స్మిత్‌తో ప్రేమలో పడ్డారు. ఈ నెల 17న న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. స్మిత్ చేతికి ఉంగరం తొడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు. తాను ప్రేమలో పడడానికి తొలుత భయపడ్డానని చెప్పారు. ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భరణం

లెస్లీ స్మిత్ భర్త కూడా వ్యాపారవేత్తే. 14 ఏళ్ల క్రితమే ఆయన మృతి చెందారు. ఇప్పుడు మర్దోక్‌తో ప్రేమలో పడిన ఆమె.. ఆయనతో జీవితం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మర్దోక్ 2016లో తనకంటే 25 ఏళ్ల చిన్నదైన అమెరికన్ నటి, మోడల్ అయిన జెర్రీ హాల్‌ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆయన  పాట్రిషియా బుకర్‌, అన్నా మరియా మన్‌, వెండీ డెంగ్‌‌లను పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య అయిన మరియా మన్ నుంచి విడాకులు తీసుకున్న సమయంలో ఆమెకు ఏకంగా 1.7 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భరణాల్లో ఇది ఒకటిగా రికార్డులకెక్కింది.


More Telugu News