భారత్‌లో అమెరికా పర్యాటకురాలికి యువకుడి ఊహించని సర్‌ప్రైజ్

  • ట్రైన్‌లో పర్సు పోగొట్టుకున్న అమెరికా మహిళ
  • పోయిన పర్సును ఆమెకు తిరిగిచ్చిన యువకుడు
  • నెట్టింట్లో వీడియో వైరల్
అతిథి దేవో భవా.. అన్న సూక్తిని తూ.చా తప్పకుండా పాటించాడో భారతీయ యువకుడు. అతడు నిండు మనసుతో చేసిన ఉపకారానికి ఓ అమెరికా మహిళ సంబరపడిపోయింది. భారత్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ అమె ఇటీవల ఇన్‌స్టాలో పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆమె ట్రైన్‌లో తన పర్సు మర్చిపోయి స్టేషన్‌లో దిగిపోయింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వీడియోలో వెల్లడించింది. 

గుజరాత్‌కు చెందిన చిరాగ్ అనే యువకుడు ఈ పోస్టును చూసి వెంటనే స్పందించాడు. ‘‘మీ పర్సు నాకు దొరికింది’’ అంటూ ఇన్‌స్టా వేదికగానే మెసేజ్ ఇచ్చాడు. భుజ్‌ ప్రాంతంలో తనకో రెస్టారెంట్ ఉందని, అక్కడికొచ్చి వ్యాలెట్ పట్టుకెళ్లమని తెలిపాడు. దీంతో.. పోయిన పర్సు దక్కడంతో ఆమె తెగ సంబరపడిపోయింది. చిరాగ్ తనకు పర్సు తిరిగిస్తుండగా తీసిన వీడియోను ఆమె నెట్టింట షేర్ చేయగా వేలకొద్దీ లైక్స్ వచ్చిపడ్డాయి. 

చిరాగ్ చేసిన సాయానికి తాను కొంత మొత్తాన్ని టిప్‌గా ఇచ్చేందుకు ప్రయత్నించగా అతడు సున్నితంగా తిరస్కరించాడని అమెరికా మహిళ చెప్పుకొచ్చింది. ప్రతిఫలం ఆశించకుండా సాయపడేవారికి డబ్బిచ్చి ధన్యవాదాలు తెలపడం ఎంత తప్పో తనకు అప్పుడు తెలిసొచ్చిందని ఆమె వ్యాఖ్యానించింది. తానిచ్చిన టిప్‌ను తిరస్కరించిన చిరాగ్.. పర్సును పొగొట్టుకోవద్దంటూ జాగ్రత్తలు చెప్పి మరీ తనకు సెండాఫ్ ఇచ్చాడని పేర్కొంది. ఈ నెల మొదట్లో ఆమె వీడియో షేర్ చేయగా ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


More Telugu News