జడ్జి పురుషుడు అయినా, మహిళ అయినా సర్ అనాలి: గుజరాత్ హైకోర్టు సీజే 

  • గుజరాత్ హైకోర్టులో ఆసక్తికర చర్చ
  • మహిళా సీజేని యువర్ లేడీషిప్ అని సంబోధించిన న్యాయవాది
  • ఆ పిలుపు సరికాదన్న ఇతర న్యాయమూర్తులు
న్యాయస్థానాల్లో జడ్జిలను ఎలా సంబోధించాలన్న దానిపై బ్రిటీష్ వారు మనదేశాన్ని వీడి వెళ్లిపోయినప్పటి నుంచి చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై గుజరాత్ హైకోర్టులోనూ స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. మై లార్డ్, యువరానర్ వంటి పదజాలంపైనా, పురుష జడ్జిలను, మహిళా జడ్జిలను ఎలా పిలవాలన్న దానిపైనా చర్చించారు. 

ఈ సందర్భంగా గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సోనియా గోకని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడ్జి పురుషుడు అయినా, మహిళ అయినా 'సర్' అనాలని పేర్కొన్నారు. అసలిదంతా ఎందుకు వచ్చిందటే... ఓ సీనియర్ న్యాయవాది హైకోర్టు సీజేని ఉద్దేశించి యువర్ లేడీషిప్ అంటూ సంబోధించారు. 

అయితే సీజే ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడు యువర్ లేడీషిప్ అని ఎలా పిలుస్తారంటూ సదరు న్యాయవాదిని ఇతర న్యాయమూర్తులు ప్రశ్నించారు. దాంతో ఆ న్యాయవాది క్షమాపణలు తెలిపారు. 

గతంలో కోర్టులో మహిళా న్యాయమూర్తులు లేకపోవడంతో లేడీషిప్ అని పిలవాల్సిన అవసరం ఉండేదికాదని చీఫ్ జస్టిస్ సోనియా గోకని తెలిపారు. మై లార్డ్, యువరానర్ అని పిలవడం కంటే సర్ లేక మేడమ్ అని పిలవడం మేలని, న్యాయమూర్తి ఎవరైనా సరే సర్ అంటే సరిపోతుందని అన్నారు. గతంలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన ఓ చర్చను కూడా ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు. గుజరాత్ లో చాలామంది న్యాయవాదులు జడ్జిలను సర్ అనే పిలుస్తున్నారని వెల్లడించారు. 

వలస పాలనను గుర్తుచేసే మై లార్డ్, యువరానర్ అనే పిలుపులను ప్రోత్సహించరాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2006లో ఓ తీర్మానం కూడా చేసింది. 

కాగా, సోనియా గోకని గుజరాత్ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా గుర్తింపు పొందారు. ఆమె గతవారమే సీజే పదవిని అధిష్ఠించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సోనియా గోకని రేపు (ఫిబ్రవరి 25) పదవీవిరమణ చేయనున్నారు. సీనియారిటీ ప్రకారం ఆమెకు చీఫ్ జస్టిస్ పదవి లభించినా, పదవీ విరమణ వయసు రేపటితో పూర్తికానుంది. దాంతో ఆమె చీఫ్ జస్టిస్ గా 9 రోజులే వ్యవహరించినట్టవుతుంది.


More Telugu News