ఆ ముగ్గురూ లేకుండా హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా కొత్త ప్రయాణం హిట్ అయ్యేనా?

  • నేడు శ్రీలంకతో భారత్ తొలి టీ20 మ్యాచ్‌
  • రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండా బరిలోకి భారత జట్టు
  • రాత్రి 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్ లైవ్
గతేడాది ఆసియా కప్‌ (టీ20), టీ20 ప్రపంచ కప్‌తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్ ల్లో నిరాశపరిచిన భారత జట్టు కొత్త ఏడాదిని సరికొత్తగా ఆరంభించాలని చూస్తోంది. 2024లో స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఇప్పటి నుంచి పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాకు టైమ్‌ టీ20 నాయకత్వ పగ్గాలు అప్పగించింది. 

మరోపక్క, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ను పక్కనబెట్టి కుర్రాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ జట్టు శ్రీలంకతో మంగళవారం నుంచి మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగే తొలి టీ20 పోరులో గెలుపే లక్యంగా బరిలోకి దిగుతోంది. గతేడాది ఐపీఎల్ టైటిల్ తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్‌ లు గెలిపించిన హార్దిక్‌ ఇప్పటికే తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ లోనూ అదే జోరు కొనసాగిస్తే టీ20 ఫార్మాట్ లో అతనికే పూర్తి స్థాయి పగ్గాలు దక్కనున్నాయి. 

తుది జట్టు ఎలా ఉండొచ్చంటే..
తొలి పోరులో ఇషాన్‌, రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే చాన్సుంది. ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ ఓపెనర్లుగా అదరగొట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో మరో ఓపెనర్‌ అందుబాటులో ఉన్నాడు. మూడో నంబర్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ కీలకం కానున్నాడు. మిడిలార్డర్‌లో సంజు శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి మధ్య పోటీ ఉంది. అనుభవం దృష్ట్యా సంజు శాంసన్ కే మొగ్గు కనిపిస్తోంది. ఆరుగురు బౌలర్ల ఆప్షన్‌తో బరిలోకి దిగితే దీపక్‌ హుడా తుది జట్టులో ఉంటాడు. పేసర్లుగా అర్ష్‌దీప్‌, హర్షల్‌, ఉమ్రాన్‌ బరిలోకి దిగొచ్చు. కెప్టెన్‌ పాండ్యాకు తోడు సుందర్‌, అక్షర్‌, హుడా రూపంలో చాలా మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ గా చహల్‌ అవసరం ఉంది. 

లంక అదే దారిలో..
కొన్నేళ్లుగా వరుస వైఫల్యాల తర్వాత శ్రీలంక గత ఆసియా కప్‌లో గెలిచింది. కానీ, టీ20 ప్రపంచ కప్‌లో నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాదిరిగా లంక కూడా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించాలని చూస్తోంది. లంక ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టిన అవిష్క ఫెర్నాండో, చమిక కరుణరత్నె, సదీర సమరవిక్రమతో పాటు వానిందు హసరంగ, భానుక రాజపక్స ఈ సిరీస్ లో కీలక కానున్నారు. 

భారీ స్కోర్లు ఖాయమే..
చిన్న సైజు బౌండ్రీ లైన్‌ కారణంగా వాంఖడేలో హైస్కోర్లు నమోదవుతుంటాయి. ఇది ఛేజింగ్‌ టీమ్‌కు అనుకూలంగా ఉంటుంది. గత రెండేళ్లలో ఆడిన 41 టీ20ల్లో 24 సార్లు ఛేజింగ్‌ టీమ్స్‌ నెగ్గాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే అనవాయతీ కొనసాగే అవకాశం ఉంది.. వాతావరణం ఆహ్లాదంగా ఉండనుంది. రాత్రి పూట మాత్రం మంచు కాస్త ప్రభావం చూపొచ్చు.


More Telugu News