నేడు బంగ్లాదేశ్‌‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్!

  • దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో భారత్ పుట్టిముంచిన ఫీల్డింగ్ వైఫల్యం
  • తనదైన రోజున అగ్రశ్రేణి జట్లను కూడా మట్టికరిపించగల బంగ్లాదేశ్
  • రాహుల్, అశ్విన్‌లను కొనసాగిస్తుండడంపై విమర్శలు
  • రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్‌‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. దక్షిణాఫ్రికా చేతిలో ఓడి కష్టాలు కొనితెచ్చుకున్న టీమిండియా నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో దారుణమైన బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్ తప్పిదాలు జట్టు ఓటమికి దారితీశాయి. మరోపక్క, తనదైన రోజున పెద్ద జట్లను కూడా కంగుతినిపించే బంగ్లాదేశ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు బంగ్లాదేశ్ ముచ్చెమటలు పట్టించింది. చివరికి అతి కష్టం మీద భారత్ గట్టెక్కింది.

ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు వరుసగా అవకాశాలు ఇస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం రాహుల్‌కే అండగా నిలుస్తున్నాడు. దీనికి తోడు నాణ్యమైన మరో ఓపెనర్ లేకపోవడం కూడా అతడికి కలిసి వస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రాణించని రాహుల్.. తర్వాత కూడా కొనసాగాలంటే ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝళిపించాల్సి ఉంటుంది. గాయం కారణంగా దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు ఉండడంతో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌కు తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. 

చాహల్‌ను పక్కనపెట్టి రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశాలు ఇస్తుండడంపైనా విమర్శలున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జట్టుకు అండగా నిలిబడి గొప్ప ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోతే భారత్ విజయానికి ఢోకా ఉండదు. ఇక, రోహిత్ శర్మ గాడిలో పడాల్సి ఉంది. ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ నుంచి అభిమానులు మరో భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. పేసర్లు అర్షదీప్, భువనేశ్వర్ కుమార్, షమీ నిలకడగా రాణిస్తున్నారు. ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఫీల్డింగ్. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా పుట్టిముంచింది ఇదే. కాబట్టి ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటే విజయం నల్లేరుమీద నడకే అవుతుంది.

ఇక, బంగ్లాదేశ్ విషయానికొస్తే.. మహామహులను మట్టికరిపించిన జట్టు అది. కాబట్టి బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే అన్ని జట్లు అప్రమత్తమవుతాయి. షకీబ్, అఫిఫ్ హుస్సేన్, మొసాదెక్ హుస్సేన్, సౌమ్య సర్కార్ లాంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలం. ముస్తాఫిజుర్ బంతితో ఇరగదీస్తున్నాడు. తస్కిన్ అహ్మద్ ఉండనే ఉన్నాడు. నెదర్లాండ్స్, జింబాబ్వేలపై నెగ్గిన ఊపులో ఉన్న బంగ్లాదేశ్ అదే ఊపు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక, టీ0 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్లు మూడుసార్లు తలపడగా మూడుసార్లూ విజయం భారత్‌నే వరించింది.


More Telugu News