మాకు ప్రపంచ కప్ కంటే బుమ్రా కెరీరే ముఖ్యం: భారత కెప్టెన్ రోహిత్

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ బుమ్రా
  • టీ20 ప్రపంచకప్ నకు దూరమైన స్టార్ పేసర్ 
  • రిస్క్ తీసుకోవద్దనే అతని విషయంలో తొందరపడలేదన్న రోహిత్
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్ లో భారత క్రికెట్ జట్టు తమ కీలక ఆటగాడైన జస్ ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది. సెప్టెంబరులో సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. దాంతో, అతను ప్రపంచ కప్ నకు దూరం అవగా అతని స్థానంలో షమీని జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచ కప్ ముంగిట బుమ్రా త్వరగా కోలుకోవాలని భారత జట్టు మేనేజ్ మెంట్ తొందరపడలేదని కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఆదివారం మొదలయ్యే ప్రపంచ కప్ ముంగిట 16 జట్ల కెప్టెన్ల కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్ బీసీసీఐ వైద్య నిపుణులతో మాట్లాడిన తర్వాత ఈ టోర్నీ కోసం బుమ్రా కెరీర్ ను రిస్క్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించాడు.
 
‘బుమ్రా నాణ్యమైన ఆటగాడు. అతను చాలా సంవత్సరాలుగా చాలా బాగా ఆడుతున్నాడు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. అవి ఆటలో సహజమే. బుమ్రా గాయం గురించి మేము చాలా మంది నిపుణులతో మాట్లాడాము. కానీ మాకు సానుకూల ఫలితం రాలేదు. ఫలితంగా ప్రపంచ కప్ కు అతను దూరం అయ్యాడు. ఈ టోర్నీ మాకు చాలా ముఖ్యమైనది. కానీ అతని కెరీర్ మాకు మరింత ముఖ్యమైనది. ఎందుకంటే అతని వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. కాబట్టి, మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. వైద్య నిపుణులు కూడా అదే సూచించారు. మున్ముందు ఇంకా చాలా ఆడుతాడు. దేశాన్ని గెలిపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ టోర్నీలో తను లేకపోవడం మాకు కచ్చితంగా ఎదురు దెబ్బే’ అని రోహిత్ స్పష్టం చేశాడు.


More Telugu News