ఫిట్ నెస్ లో కోహ్లీని కొట్టేవాడే లేడనేందుకు ఇదే నిదర్శనం!

  • గతేడాది గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో ఎన్సీఏకు 23 మంది సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లు 
  • మొత్తం 70 మందితో కూడిన జాబితాలో లేని విరాట్ కోహ్లీ 
  • అతని ఫిట్ నెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ
టీమిండియా సూపర్ స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. భారత జట్టు ఫిట్ నెస్ ప్రమాణాలను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు అతను. జిమ్ లో, మైదానంలో గంటల కొద్దీ శ్రమిస్తాడు తను. ఈ విషయంలో తోటి ఆటగాళ్లలోనూ స్ఫూర్తి నింపుతాడు. అందుకే తను ఇప్పటిదాకా ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొన్నది లేదు. 

అలాగే గాయాలతో జట్టుకు దూరమైన సందర్భాలూ చాలా అరుదు. ఇందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) తాజాగా వెల్లడించి లెక్కలే నిదర్శనం. ఈ ఏడాది భారత సెంట్రల్ కాంట్రాక్టు కలిగిన 23 మంది ఆటగాళ్లలో కోహ్లీ మినహా ప్రతీ ఒక్కరూ గాయం లేదా, ఫిట్‌నెస్ సమస్యలతో ఎన్‌సీఏకు చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నారని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమిన్ ఓ జాబితా ప్రకటించారు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఇప్పటి వరకు ఎన్‌సీఏ తలుపు తట్టలేదు. 

హేమంగ్ అమిన్ 2021–22  సీజన్‌లో అన్ని వయసుల క్రికెటర్ల పునరావాసానికి సంబంధించి ఎన్సీఏ చేసిన పనిని వివరించే నివేదికను సిద్ధం చేశారు. పురుషులు, మహిళలు సహా మొత్తం 70 మంది ఆటగాళ్లు వైద్య బృందం చికిత్స కోసం ఎన్ సీఏను సందర్శించారు. వారిలో 23 మంది సీనియర్ జాతీయ జట్టుకు చెందినవారు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వంటి టీమిండియా ప్లేయర్లు పునరావాస ప్రయోజనాల కోసం గత ఏడాది ఎన్ సీఏని సందర్శించారు.

ఈ 70 మంది ఆటగాళ్లలో  25 మంది ఇండియా–ఎ ప్లేయర్లు, అండర్–19 జట్టు ఆటగాడు ఒకరు, సీనియర్ మహిళల జట్టు నుంచి ఏడుగురు, మరో 14 మంది వివిధ రాష్ట్రాల జట్లకు చెందిన వాళ్లు ఉన్నారు. ఇంత మంది ఏదో సమస్యతో ఎన్ సీఏకు వచ్చినప్పటికీ కోహ్లీ ఒక్కడికే అవసరం లేకపోవడం విశేషం. భారత జట్టు మేనేజ్‌మెంట్ పనిభారం నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టడంతో మాజీ కెప్టెన్‌కు సిరీస్ ల మధ్య విశ్రాంతి లభించింది. ఆసియాకప్ నకు ముందు తను వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు వెళ్లలేదు.


More Telugu News